గిన్నెలో కోడి కాదు.. గిన్నీస్‌లో కోడి!

కోడి సాధారణంగా పొయ్యి మీద వున్న గిన్నెలోకి చేరుతుంది.. కానీ, బ్రిటీష్ కొలంబియాలో ఒక కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ప్రపంచం మొత్తంలో అంకెలను, రంగులను గుర్తుపట్టి చెప్పగలిగే కోడిగా ఈ కోడి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. ఈ కోడి ఈ ఘనతను సొంతగా ఏమీ సాధించలేదు. ఎమీలా అనే ఒక పశువైద్యురాలికి, కోడికి అంకెలను, రంగులను గుర్తుపట్టే విధంగా ట్రైనింగ్ ఇస్తే ఎలా వుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆమె వెంటనే తన ఆలోచనని అమల్లో పెట్టేసింది. దీని కోసం ఒక కోడి గుడ్డును ఎంపిక చేసుకుంది. ఆ గుడ్డులోంచి కోడిపిల్ల బయటకి వచ్చినప్పటి నుంచి దానికి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఆ కోడి పిల్ల పెరిగి కోడి పుంజు అయ్యే నాటికి చాలా అంకెలని, రంగులని గుర్తుపట్టగలిగే టాలెంట్ సంపాదించుకుంది. అందుకే, గిన్నెలోకి వెళ్ళాల్సిన ఆ కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ఈ కోడిని కోసుకుని కూర వండుకునే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని, అది బతికి వున్నంతకాలం తనతోనే వుంచుకుంటానని డాక్టర్ ఎమీలా చెబుతోంది.