రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
posted on Aug 6, 2015 3:40PM
.jpg)
రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఈరోజు మరో కీలక పరిణామం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐ.ఏ.యస్. అధికారుల కమిటీ ఈ కేసుపై విచారణ జరిపి ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించేలోగానే నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాజశేఖర్ ఈరోజు ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రిన్సిపాల్ బాబురావుపై పిర్యాదు చేసారు. అతను విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అరికట్టడంలో విఫలమయ్యాడని అందువలననే రిషితేశ్వరి ర్యాగింగ్ కి గురయి ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని ఆయన ఆరోపించారు. అంటే ఆమె మరణానికి ప్రిన్సిపాల్ బాబురావే కారకుడని ఆయన పరోక్షంగా ఆరోపిస్తున్నట్లు భావించవచ్చును.
కానీ ఐ.ఏ.యస్. అధికారుల కమిటీ ఈ కేసుపై విచారణ జరుపుతున్నప్పుడు ఏమీ మాట్లాడని రాజశేఖర్ అకస్మాత్తుగా ప్రిన్సిపాల్ బాబురావుపై పోలీసులకి పిర్యాదు చేయడం, అతనే రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకుడని పరోక్షంగా చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ ఇదే విషయాన్ని ఆయన ఐ.ఏ.యస్. అధికారుల కమిటీ ముందు చెప్పి ఉండి ఉంటే ఇప్పుడు ఆయన పోలీసులకి పిర్యాదు చేసినా ఎవరికీ ఆశ్చర్యం అనుమానం కలిగి ఉండేవి కావు. కానీ విచారణ కమిటీ ముందు నోరు మెదపకుండా ఊరుకొని ఇప్పుడు పోలీసులకి పిర్యాదు చేయడం సహజంగానే అనుమానాలు కలిగిస్తోంది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ బాబురావుని అరెస్ట్ చేయాలని వైకాపా వాదిస్తోంది. బహుశః ఆ పార్టీ ప్రభావం లేదా ఒత్తిడి కారణంగా రాజశేఖర్ బాబురావుపై పిరుయాదు చేసారేమోననే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.