కిషన్ రెడ్డిపై బీజేపీలో తిరుగుబాటు.. ఆ వీడియోల సంకేతం అదేనా?
posted on Oct 18, 2024 2:11PM
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డికి సొంత పార్టీలోనే తలనొప్పులు ఉన్నాయా? ఆయన వల్ల పార్టీకి ఇసుమంతైనా ప్రయోజనం లేదనీ, పైపెచ్చు పార్టీకి ఆయన తీరని నష్టం చేస్తున్నారంటూ కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ వీడియోల సృష్టికర్తలు బీజేపీ వారేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కిషన్ రెడ్డి నిష్క్రియాపరత్వంపై, అలాగే ఇతర పార్టీలకు అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో చాలా కాలంగా అసంతృప్తి ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే గత ఎన్నికల ముందు అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన సమయంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్ వారి అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచీ కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా సొంత పార్టీలోనే కిషన్ రెడ్డి పట్ల తీవ్ర అసంతృప్తి ఎటువంటి దాపరికం లేకుండా వ్యక్తం అవుతూనే వస్తోంది.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోల వెనుక ఉన్నది సొంత పార్టీ నేతలేనని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. ఇలా ఉండగా పార్టీ ప్రతిష్ట, కిషన్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోలు ఉండటంతో సైబర్ క్రైమ్ పోలీసులకు సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై వీడియోలు వైరల్ అవుతున్నాయి. కిషన్ రెడ్డి పార్టీలో ఎవరికి ఉపయోగపడడు... సొంత పార్టీ నేతల ఓటమి గురించి పని చేస్తాడని.. తన సొంత లోక్ సభ నియోజక వర్గంలో ఒక్క ఎమ్మెల్యేను గెలుపించుకొని అసమర్థ నాయకుడు.. పక్క పార్టీ నేతల గెలుపు కోసం కృషి చేస్తాడంటూ అగంతకులు వీడియోలు తాయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.బీజేపీ ప్రతిష్ఠ, కిషన్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఈ వీడియోలు ఉండటంతో.. బీజేపీ నేతలు సైబర్ క్రైమ పోలీసులకు ఫిర్యాదు చేశారు.