రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ వచ్చే నెలలో?

ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి బడ్జెజ్ ను వచ్చే నెలలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. మొత్తం 2.90లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర విత్త మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆర్థిక శాఖ అధికారులంతా బడ్జెట్ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇందు కోసం మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పయ్యావుల కేశవ్ సంప్రదిస్తున్నారు.  

ఎన్నికల దృష్ట్యా గత జగన్ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే.  2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు శాసనసభ ఆమోదం తీసుకుంది. జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, అప్పుల అంశాలపై స్పష్టత లేకపోవడం వల్ల మరోసారి ఓటాన్ ఎకౌంట్ రూపంలో ఆర్డినెన్సు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఆగస్టు నుంచి నవంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల కోసం రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తీసుకున్నది. ఈ మొత్తం కాలంలో, మొత్తం 8 నెలల కాలం ఓటాన్ ఎకౌంట్ పద్ధతిని ఉపయోగించారు. ఈ నేపథ్యంలో నవంబరు లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమాయత్తమౌతోంది. ఈ బడ్జెట్ లో   సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు: ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌కు పెద్దపీట వేయనున్నారు. అలాగే రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి భారీగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అలాగే రహదారుల నిర్మాణం, మరమ్మతుల కోసం సముచిత కేటాయింపులు ఉంటాయని అంటున్నారు.