జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ.. కేబినెట్ తీర్మానం
posted on Oct 18, 2024 2:32PM
జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.
జమ్ముకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో గురువారం(అక్టోబర్ 17) సమావేశమైన మంత్రివర్గం జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరించాలంటూ తీర్మానించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరలేదు. ఫరూక్ అబ్డుల్లా కేబినెట్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పెద్దలంతా హాజరయ్యారు. కాగా ఒమర్ అబ్దుల్లా కేబినెట్ గురువారం తొలి సారిగా సమావేశమైంది. ఈ సమావేశంలోనే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై తీర్మానాన్ని ఆమోదిదంచింది. ఒకటి రెండు రోజులలో హస్తిన వెళ్లి ప్రధాని మోడీకి ఈ తీర్మానాన్ని అందించనున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
జమ్ముకశ్మీర్‌కు కేంద్రం త్వరలో రాష్ట్ర హోదాను పునరుద్ధ రిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిందని తెలిపిన ఆయన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందని ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
2019 ఆగస్టు 5న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జమ్మూ కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తి కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను తొలగించి, జమ్ము కశ్మీర్, లడఖ్ లుగా విభజించి రెండింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.