బీఆర్ ఎస్ హయాంలో అవినీతిపై రేవంత్ వార్.. బటయకొస్తున్న లొసుగులు
posted on Feb 11, 2024 5:57AM
గులాబీ బాస్ కేసీఆర్ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని టీఆర్ ఎస్ పేరును కాస్తా బీఆర్ ఎస్‌గా మార్చేసిన కేసీఆర్‌కు తెలంగాణ ఓటర్లు గట్టి షాకిచ్చి అధికారాన్ని దూరం చేశారు. ప్రస్తుతం అటు కేంద్రంలో చక్రం తిప్పుడేమో కానీ, రాష్ట్రంలో తన వర్గీయులను కాపాడుకొనేందుకు పడరానిపాట్లు పడాల్సి పరిస్థితి ఏర్పడింది. బీఆర్ ఎస్ హయాంలో కేసీఆర్ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైంది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు గొంతు చించుకున్నారు. కానీ, కేసీఆర్ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ నేతలవి కేవలం ఆరోపణలు మాత్రమేనని కొట్టి పారేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో గత ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై గురి పెట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తేల్చేందుకు జ్యూడీషియల్, విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ప్రాజెక్టుల నిర్మాణాల్లో గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై సభలో చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యంపై అధికార పక్షం అసెంబ్లీ వేదికగా బీఆర్ ఎస్ ను టార్గెట్ చేసేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13న మేడిగడ్డ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. 119 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసన మండలి సభ్యులను సైతం 13న ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్తామని రేవంత్ చెప్పారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా సందర్శనకు రావాలని, ఈ మేరకు కేసీఆర్ ను ఆహ్వానించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ సూచించారు. దీంతో, బీఆర్ ఎస్ హయాంలో ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని ఎమ్మెల్యేలందరి సమక్షంలో ప్రజలకు వివరించేలా చేసేలా రేవంత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా పరిణామాలపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందని, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దది.. చూడాలనీ అనుకుంటే కాంగ్రెస్ నేతలు వెళ్లి చూడొచ్చని కేటీఆర్ అన్నారు. తద్వారా, ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వం ఆహ్వానాన్ని బీఆర్ ఎస్ తిరస్కరించినట్లేనని చెప్పకనే చెప్పారు. అంతే కాక, ప్రాజెక్టులో చిన్న చిన్న లోపాలు ఉంటే ఎత్తిచూపాలని, అంతే కానీ దాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా లొసుగులు ఉన్నాయని, అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లేనని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తూ బీఆర్ ఎస్ నేతలను ఆందోళనకు గురిచేస్తున్న రేవంత్.. తాజాగా మరో బాంబు పేల్చారు.
సెక్రటేరియట్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణంలో అవినీతిపై విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ అన్నారు. మొత్తానికి, బీఆర్ ఎస్ హయాంలో జరిగిన ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలపై అవినీతి జరిగిందని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం.. వాటిపైన విచారణ జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవటంకూడా బీఆర్ ఎస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్నట్లు బీఆర్ ఎస్ హయాంలో అతిపెద్ద స్థాయిలో అవినీతి జరిగిందా? ఒకవేళ అదే జరిగితే అధికార పార్టీ నేతలను ఎదుర్కోవటం ఎలాఅనే ఆందోళనలో బీఆర్ ఎస్ ముఖ్యనేతల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకు ఉన్నారు. ప్రాజెక్టులపై అవినీతిని రేవంత్ సర్కార్ ప్రస్తావిస్తుంటే.. కౌంటర్‌గా.. కేసీఆర్ మాత్రం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి రేవంత్ ప్రభుత్వం అప్పగించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేలా ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు నల్గొండ జిల్లాలో 13న బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారు? రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులపై చేస్తున్న వాదనలకు ఏవిధంగా సమాధానం చెబుతారనే అంశం తెలంగాణ ప్రజల్లో ఆసక్తినిరేపుతోంది.