ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు? మోడీ విందుకు రామ్మోహన్ నాయుడు!
posted on Feb 11, 2024 6:42AM
ఎన్నికల నగారా ఇంకా మోగలేదు.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మాత్రం వేగంగా మారిపోతున్నాయి. తాజాగా ఢిల్లీ వేదికగా చోటు చేసుకొంటున్న వరుస పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తే మాత్రం ఈ విషయం క్లియర్ కట్‌గా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రధాని మోదీ 8 మంది ఎంపీలతో కలిసి పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు. వారిలో టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. అదీకూడా ముందుగా సమాచారం లేకుండా.. అప్పటికప్పుడు ఎనిమిది మంది ఎంపీలకు ప్రధాని కార్యాలయం ఫోన్ చేసి.. ప్రధాని మోదీ మీతో విందు చేసేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పడంతో.. వారంతా హుటాహుటిన పార్లమెంట్ క్యాంటన్ వైపు పరుగులు తీశారు.
ఆ మరునాడే శనివారం (ఫిబ్రవరి 10) న్యూఢిల్లీలో ఓ సదస్సులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని.. అయితే ఆ పొత్తులపై ఇప్పుడేమి మాట్లాడలేమని చెప్పారు. అలాగే త్వరలోనే ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తమ మిత్రులను తామంతట తాముగా ఎప్పుడూ బయటకు పంపలేదనీ, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలు, పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా చెప్పారు. అయితే రాష్ట్రీయ లోక్‌దళ్, శిరోమణి అకాలీదళ్ వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరతాయా? అనే ప్రశ్నకు మేము ఫ్యామిలీ ప్లానింగ్ నమ్ముతాం కానీ.. రాజకీయాల్లో మాత్రం కాదని ఆయన తనదైన శైలిలో స్పష్టం చేశారు.
ఇక ఇటీవల తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఏపీలో ఎన్నికల వేళ .. పొత్తులపై ఢిల్లీ వెళ్లి.. కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించారు. ఆ వెంటనే.. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్.. ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైయ్యారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ... ఏపీలో రాజకీయం మార్పులు చేర్పులకు గురవుతుందనేది సుస్పష్టమని.. అలాంటి వేళ చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం... ఆ వెంటనే సీఎం జగన్ కూడా అదే బాట పట్టడం.. మరోవైపు ఏనిమిది మంది ఎంపీలకు ప్రధాని మోడీ విందు ఇవ్వడం, అందులో శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్ నాయుడు ఉండడం.. ఆ మరునాడే కేంద్ర మంత్రి అమిత్ షా.. ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఎన్నికల వేళ.. ఏపీలో రాజకీయ సమీకరణాలు కీలకంగా మారతాయని.. అలాగే అవి ప్రజలనే కాదు.. విజయాన్ని సైతం ప్రభావితం చేసేందుకు దోహదపడతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదీకాక తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 42 మంది లోక్ సభ సభ్యులు ఉంటే... వారిలో కె. రామ్మోహన్ నాయుడిని మాత్రమే ప్రధాని మోదీ విందుకు ఆహ్వానించడం పట్ల పోలిటికల్ సర్కిల్‌లో సైతం ఓ విధమైన చర్చకు తెర తీసింది.