డీలిమిటైజేషన్ కలిపింది ఇద్దరినీ..!

తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప్పు, నిప్పు వంటి వారు. విమర్శల స్థాయిని వారిరువురూ దూషణల స్థాయికి దిగజార్చేశారు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటూ ఉంటారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సై అంటే సై అని తలపడుతుంటారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటే.. కేసీఆర్ విపక్షంలో ఉన్నారు. వీరిద్దరూ ఒకే మాట మాట్లాడటం అన్నది.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏ విషయంలోనైనా ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం అన్నది ఇప్పటి వరకూ జరగలేదు. అసలలాటిం సందర్భం ఒకటి వస్తుందన్న ఊహ కూడా రాజకీయవర్గాలలోనే కాదు, సామాన్య జనంలో కూడా రాలేదు.  రేవంత్, కేసీఆర్ మధ్య మాటలయుద్ధం జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. రాజకీయ మర్యాదలకు కూడా తిలోదకాలిచ్చి వారు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటుంటారు. 

అయితే అనూహ్యంగా ఆ ఇరువురి నోటీ ఒకే మాట వచ్చింది. ఏదో సినిమాలో నువ్వాదరిని.. నేనీ దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అన్న పాటను స్ఫురింపచేసేలే.. నిప్పూ ఉప్పులా చెరో వైపూ ఉండే రేవంత్ రెడ్డి, కేసీఆర్ లను నియోజకవర్గాల పునర్విభజన అంశం ఏకతాటిపైకి తెచ్చింది. ఔను డీలిమిటైజేషన్ ను వ్యతిరేకించే విషయంలో ఇరువురి నోటా ఒకే మాట వచ్చింది.  కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించే విషయంలో ఇరువురి నోటీ ఒకే మాట వినిపిస్తోంది.  

జనాభా ప్రాతిపదికగా మాత్రమే జరిగే డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నచర్చ జోరుగా సాగుతోంది. ముందుగా ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిరసన గళం ఎత్తారు.  జనాభా ప్రాతిపదికగా జరిగే డీలిమిషేషన్ తో పెరిగే సీట్లన్నీ ఉత్తరాదిలోనే పెరుగుతాయనీ, దక్షిణాదిలో నామమాత్రంగా సీట్లు పెరగడమో… లేదంటే అసలు సీట్లే పెరగకపోవడమో.. ఇంకా చెప్పాలంటే సీట్ల సంఖ్య  తగ్గిపోవడమో జరుగుతుందన్న ఆందోళనను డీఎంకే వ్యక్తం చేసింది.  దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగడానికి దోహదం చేసింది. అంతే కాకుండా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో ఈ నెల 22న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

చెన్నై వేదికగా జరగనున్న ఈ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే తెలంగాణలోని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ లకు డీఎంకే  ఆహ్వానించింది. రేవంత్, కేటీఆర్ ఇద్దరూ కూడా ఈ సమావేశాన్నిస్వాగతించారు. హాజరవ్వడానికి అంగీకరించారు.   డీఎంకేతో కాంగ్రెస్   పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అటువంటిది డీఎంకే సమావేశానికి హాజరౌతామని కేటీఆర్ అంగీకరించడం విశేషమేనని పరిశీలకులు అంటున్నారు. అదీ కాక రేవంత్, కేటీఆర్ లు ఇద్దరూ ఈ సమావేశానికి హాజరు కానుండటం రాజకీయవర్గాలలో ఆసక్తి రేకెత్తించింది.  మొత్తం మీద రేవంత్, కేటీఆర్ ల నోట ఏ విషయంలోనైనా సరే ఏకాభిప్రాయం వ్యక్తం కావడం ఇదే మొదటి సారి అని కూడా అంటున్నారు. చెన్నై వేదికగా జరిగే అఖిలపక్ష సమావేశంలో ఇరువురూ ఒకే వేదిక పంచుకుంటే అది రాజకీయంగా ఒక గొప్ప విశేషంగానే చెప్పుకోవలసి ఉంటుంది. చూడాలి మరి.. రేవంత్ కేసీఆర్ లు ఆ సమావేశానికి స్వయంగా హాజరౌతారో తమతమ పార్టీల తరఫున ప్రతినిధులను పంపుతారో.