నెక్స్ట్ ఏంటి?
posted on Mar 14, 2025 12:46PM

రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఢిల్లీ వెళ్ళడం కొత్త విషయం కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ వుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పడు, ముఖ్యమంత్రులు ఒక కాలు ఢిల్లీలో మరో కాలు హైదరాబాద్ లో అన్నట్లు ఇటూ అటూ చక్కర్లు కొడుతూ ఉండేవారని అంటారు. అందులోనూ ప్రధానంగా అధిష్టానం మొక్కులు చెల్లించుకోవడంకోసమో, రాష్ట్రం నుంచి అధిష్టానికి చేరిన ఫిర్యాదులకు, సంజాయిషీ ఇచ్చుకోవడం కోసమో అప్పట్లో ముఖ్యమంత్రుల ఢిల్లీ యాత్రలు సాగేవని అప్పటి రాజకీయాలు ఎరిగిన సీనియర్ పాత్రికేయ మిత్రులు అంటుంటారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత వరసగా రెండు మార్లు ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు మాత్రం ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు తక్కువనే చెప్పుకోవాలి. ఒక విధంగా చూస్తే ఆయన వెళ్ళిన సందర్బాలను వేళ్ళ మీదలెక్క పెట్ట వచ్చునేమో. ఢిల్లీ వెళ్ళినా, పంటి నొప్పి, కంటి నొప్పి పేరున వెళ్లి రావడమే కానీ, ప్రత్యేకించి అధికారిక కార్యకలాపాల కోసంగా ఢిల్లీ వెళ్లిన సందర్భాలు, ప్రధాని లేదా ఇతర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి చర్చించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. అలాగని కేంద్రంతో ఏ సంబంధాలు లేకుండా కాలం వెళ్ళ దీశారా, అంటే లేదు. రాజకీయ శతృమిత్ర సంబంధాల విషయంలో ఆయన చేయాల్సిన రాజకీయం ఆయన చేశారు.
కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి రాష్ట్ర మంత్రులు,అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో అధికారిక స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపడం, అవసరం అయితే వారే ఢిల్లీ వెళ్లి పని కానిచ్చుకోవడమే కానీ, ముఖ్యమంత్రి స్వయంగా ఫైల్స్ చంకన పెట్టుకుని ఢిల్లీ వెళ్ళడం అప్పట్లో అంతగా లేదు.
అలాగని కేంద్రంతో సయోధ్యంగా ఉన్నారా అంటే అదీ లేదు. ధాన్యం కొనుగోలు విషయం మొదలు అనేక విషయాల్లో కేంద్రంపై రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీ వెళ్లి మరీ వీధి పోరాటాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చిన అనేక సందర్భాలలో బీఆర్ఎస్ సిటీ అంతా నల్ల జెండాలు కట్టి, గో బ్యాక్ మోడీ నినాదాలతో నిరసన వాతావరణం సృష్టించింది. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కనీస మర్యాద పాటించలేదు. ప్రోటోకాల్ నిబంధనలను బేఖాతర్ చేశారు. ప్రధాని పర్యటనకు వచ్చిన ప్రతి సారీ ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. ప్రధానమంత్రి వట్టి చేతులతో వస్తే ఎంత పోతే ఎంత, మూటలతో వస్తేనే స్వాగతం లేదంటే, నల్ల జెండాలు, గో బ్యాక్ నినాదాలే స్వాగతం చెపుతాయి అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ , ప్రభుత్వం వ్యవహరించాయి. అప్పట్లో బీఆర్ఎస్ వ్యవహార శైలి, మా ఇంటికొస్తే, మాకేం తెస్తావ్, మీ ఇంటి కొస్తే మాకేం పెడతావ్ అన్నట్లు ఉండేది. సరే, అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు అనేది వేరే చర్చ. వదిలేద్దాం.
అదలా ఉంటే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి జాతీయ జెండా ఎత్తిన తర్వాత కేసీఆర్ బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసేందుకు కాలికి బలపం కట్టుకుని దేశం అంతా తిరిగొచ్చారు. సరే, ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించక పోగా, ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది అన్నట్లు రాష్ట్రంలో అధికారం పోయింది. లోక్ సభలో బీఆర్ఎస్ కు కనీస ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. అది వేరే విషయం.
ఇక ఇప్పడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. గత కొంత కాలంగా ఆయన ఢిల్లీ పర్యటనలు ఎక్కువయ్యాయి. ఒక పూట ఇక్కడ ఒక పూట అక్కడ అన్నట్లుగా అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళితే పార్టీ అధిష్టాన్ని కలవకుండా వెనక్కి రావడం చాలా అరుదు. కానీ రేవంత్ రెడ్డి ఒకటి రెండు సందర్భాలలో అది కూడా అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లి నప్పడు మినహా అధిష్టానాన్ని కలిసింది లేదని అంటున్నారు. మరో వంక గత ఆరేడు నెలలుగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ దొరకడం లేదని తెలుస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డికి, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రుల అప్పాయింట్మెంట్ అయినా దొరుకోతోంది కానీ, రాహుల్ గాంధీ అప్పాయింట్మెంట్ దొరకడం లేదని అంటున్నారు.
ఈ నేపధ్యంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రల రహస్యం ఏమిటనేది, కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. అలాగే, రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడ ఏమిటి? అన్న విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ ఏంటి ? ఒక విధంగా ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.