జగన్ పై బాలినేని బాంబు.. నా ఆస్తులు లాక్కొన్నారంటూ సంచలన ఆరోపణ
posted on Mar 15, 2025 6:36AM
.webp)
జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. పిఠాపురంలో శుక్రవారం (మార్చి 14) జరిగిన జనసేన ఆవిర్భావ సభ వేదికగా బాలినేని ఈ ఆరోపణలు చేశారు. ఇప్పటికే జగన్ తల్లి, చెల్లితో ఆస్తుల పంచాయతీ కోర్టుకెక్కిన నేపథ్యంలో బాలినేని చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బాలినేని కూడా జగన్ కు సమీప బంధువు. నిన్న మొన్నటి దాకా ఆయన వైసీపీలోనే ఉన్నారు. పలు మార్లు ఆ పార్టీ అధినేతతో విభేదించారు. అలకబూనారు. ధిక్కార స్వరం వినిపించారు. అయినా సర్దుకు పోయారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన తరువాత కూడా ఆయన కొంత కాలం వైసీపీలో కొనసాగారు. ఒంగోలులో తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమంటూ ఆరోపణలు చేశారు. ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. ఆ తరువాత వైసీపీ తీరుతో, మరీ ముఖ్యంగా జగన్ వైఖరితో విసికి పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.
ఇప్పటి వరకూ జగన్ పై రాజకీయ విమర్శలే చేస్తూ వచ్చిన బాలినేని జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా జగన్ తన ఆస్తులను లాక్కొన్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనవే కాదు తన వియ్యంకుడి ఆస్తులు కూడా జగన్ లాగేసుకున్నారని ఆరోపించారు. జగన్ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, ఆస్తల కబ్జాల గురించి తర్వాత సమయం వచ్చినప్పుడు వివరంగా చెబుతానని బాలినేని అన్నారు. జగన్ తన తండ్రి పేరు చెప్పుకుని ఓ సారి సీఎం కాగలిగారన్నారు. ఇక మరోమారు జగన్ సీఎం అయ్యే అవకాశమే లేదని బాలినేని కుండబద్దలు కొట్టారు. త్వరలో జనసేనాని పవన్ కల్యాణ్ హీరోగా తాను ఓ సినిమా నిర్మించనున్నట్లు బాలినేని జయకేతనం సభ వేదికగా ప్రకటించడం కొసమెరుపు.