ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి.. ఏం చేసిందంటే?

అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణలు ఆవాసాలు కోల్పోతున్నాయి. జనావాసాలపై పడుతున్నాయి. ఆహార, నీటి కోసం అవి వనాలను వదిలి జనాల నివాసాలవైపు వస్తున్నాయి. ఈ పరిణామం అటు వన్యప్రాణులకు, ఇటు మనుషులకూ కూడా ప్రమాదకరంగానే మారుతోంది. తాజాగా అలా జనావాసాలపై వైపు వచ్చిన ఓ చిరుత పులి.. ఓ ఇంట్లోకి దూరి ఆ ఇంటి పెంపుడు కుక్కను నోట కరుచుకుని పారిపోయింది.

అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయ్యింది. చిరుతపులి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో ఆ ఇంటి యజమాని ఫోన్ లో బిజీగా ఉన్నారు. చిరుత మాత్రం పిల్లిలా ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఆడుకుంటున్న కుక్క పిల్లను నోట కరుచుకుని పారిపోయింది. ఈ సంఘటన పుణెలోని భోర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. జయానంద్ కాలే అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన చిరుత జయానంద్ కాలే పడుకుని ఉన్న మంచం కింద ఉన్న కుక్కపిల్లను నోట కరుచుకుని ఉడాయించింది.  

ఈ వీడియోపై నెటిజనులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పెంపుడు కుక్కను కోల్పోయిన జయానంద్ కాలేపై సానుభూతి వ్యక్తం చేస్తూనే, అతడు అదృష్టవంతుడని కామెంట్లు పెడుతున్నారు. కుక్కపై కాకుండా అతనిపై దాడి చేసి ఉంటే పరిస్థితి ఏంటని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల నుంచి ప్రజలకు రక్షణ కరవైందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.  

 ⁠