ఉచిత విద్యుత్‌పై బహిరంగ చర్చకు కేసీఆర్‌ సిద్ధమా?

 

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి కేసీఆర్ నోట బాగా వినిపిస్తున్న మాటల్లో 24 గంటల ఉచిత విద్యుత్‌ ఒకటి. మేం అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయి. ఒకవేళ అవి మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణలో చీకటే మిగులుతుంది అంటూ కాంగ్రెస్, టీడీపీ మీద కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓ వైపు కేసీఆర్ కి సమాధానం చెప్తూనే మరోవైపు ఛాలెంజ్ విసిరారు.

విద్యుత్‌పై కేసీఆర్‌ కాకమ్మ కథలు చెబుతున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. గతంలో ఉత్పత్తి తక్కువగా ఉండేది, డిమాండ్‌ ఎక్కువగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఉత్పత్తి ఎక్కువ, డిమాండ్‌ తక్కువ ఉందని అన్నారు. ఇందులో కేసీఆర్‌ ఘనత ఏమీ లేదని తెలిపారు. కమీషన్లకు కక్కుర్తిపడి 24 గంటల విద్యుత్‌ ఇస్తూ రైతుల్లో సెంటిమెంట్‌ రాజేస్తున్నారని అన్నారు. ప్రైవేటు కంపెనీల కమీషన్‌ కోసమే 24గంటల విద్యుత్‌ ఇస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు కరెంట్‌ ఉత్పత్తి చేస్తున్న సంస్థలన్నీ కాంగ్రెస్‌ హయాంలోనివేనని గుర్తుచేశారు. కేసీఆర్‌ ఒక్క యూనిట్‌ విద్యుత్‌ అయినా అదనంగా ఉత్పత్తి చేశారా? అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌తో ప్రైవేటు కంపెనీలపై రూ.వేల కోట్ల భారం పడిందన్నారు. ఉచిత విద్యుత్‌పై బహిరంగ చర్చకు కేసీఆర్‌ సిద్ధమా? అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.