35 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కండువాతో చంద్రబాబు

 

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ని గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్,టీడీపీ పొత్తు పెట్టుకొని ప్రజకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకున్నారు. పలు సభల్లో పాల్గొని బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కానీ చంద్రబాబుకి సనత్ నగర్ నియోజక వర్గంలో సత్యం థియేటర్ వద్ద నిర్వహించిన సభలో అనూహ్య పరిణామం ఎదురయ్యింది. కాంగ్రెస్ మహిళా నేత గంగా భవానీ చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన మెడలో కాంగ్రెస్ కండువా వేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబు 1983 లో టీడీపీలో చేరారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువాని వదిలేసిన చంద్రబాబు 35 ఏళ్ల తర్వాత కప్పుకోవలసి వచ్చింది.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ తో చంద్రబాబు చేతిలో చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు అప్పటికే పార్టీలో  సీనియర్ నేతగా పేరున్న అజాద్ ను చంద్రబాబు గురువుగా భావించేవారట. చంద్రబాబు టీడీపీలో చేరిన తర్వాత దూరమైన వీళ్ళు నాంపల్లిలో మహాకూటమి ఎన్నికల ప్రచార సభలో ఒకే వేదికపై కూర్చుని చేతిలో చేయి వేసి మాట్లాడుకున్నారు. మహాకూటమి పుణ్యమా అని అనేక ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.