సొంత కుటుంబాల్లోనే నిరసన కుంపట్లు.. వైసీపీ కొంప మునిగిపోయినట్లేనా?

ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా? 

ఇప్పుడు వైసీపీలో కీలక నేతలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. స్వయంగా జనగ్ నుంచి, ఆ పార్టీలో బాగా నోరున్న నేతగా పేరుబడిన అంబటి దాకా, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడించడానికి తురుఫు ముక్కగా భావించి తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభం వరకూ సొంత ఇంటి నుంచే నిరసన సెగలు ఎదుర్కొంటున్నారు. దీంతో జగన్ పార్టీ సొంతింటి సెగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎం చేయాలో, ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్ధం కాక అవస్ధలు పడుతోంది.  పార్టీ అగ్రనేతలు, మంత్రులు ఆఖరికి పార్టీ అధినేత ఇంట్లోనే  వ్యతిరేకత అధికారపార్టీకి వడదెబ్బ తగిలేలా చేస్తోంది. ముందుగా  పార్టీ అధినేత జగన్ విషయమే తీసుకుంటే ఆయనను సొంత కుటుంబ సభ్యులే నమ్మడం లేదు.  సొంత చెల్లి షర్మిల- చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత.. జగనన్నకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ కూడా జగనన్న పార్టీకి ఓటేయద్దని  కోరుతూ బహిరంగ లేఖ సైతం రాశారు.  చిన్నాన్న హంతకుడు అవినాష్‌రెడ్డికి ఎలా టికెట్ ఇచ్చావు? అసలు నీవు అన్నవేనా? నీకు మైండ్ పనిచేస్తుందా? లేదా? తండ్రిని చంపారన్న రిలయన్స్ కంపెనీ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ ఎలా ఇచ్చావ్? నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటూ షర్మిల ఊరూ వాడా తిరుగుతూ జగన్ పరవు బజారున పడేస్తున్నారు. ఎన్నికల వేళ తన ప్రచారంలో జగన్ పై విమర్శనాస్త్రాలు, ప్రశ్నాస్త్రాలూ సంధించని రోజుంటూ లేకుండా ఆమె సాగుతున్నారు.  ఇక జగన్ కూడా షర్మిల తన తండ్రికి వారసురాలు కాదంటూ కరాఖండీగా నిండు సభలో సెలవిచ్చారు.  

ఇక స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత  మాజీ మంత్రి మద్రగడ పద్మనాభం ను కాపుల ఓట్లు చీల్చి వైసీపీని ప్రయోజనం చేకూర్చు తురుఫు ముక్కగా భావించి దరికి చేర్చుకున్నా జగన్ కు ఇప్పుడు ఆయన ఒక గుదిబండగా మారిపోయారు. అందుకు కూడా ముద్రగడు కుటుంబ పోరే కారణం అయ్యింది. ముద్రగడ పిలుపునిస్తే కాపు సామాజికవర్గం అంతా కలిసి వస్తుందని జగన్ భావించారు. అందుకే పిఠాపురంలో జగన్ ను ఓడించాలంటే ముద్రగడను పార్టీలో చేర్చుకుంటే సరిపోతుందని భావించారు. జగన్ పిలుపునందుకుని ముద్రగడ కూడా వైసీపీ గూటికి చేరిపోయారు.  అలా చేరి ఊరుకోలేదు.. పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే, తాను పేరు మార్చుకుంటానని  శపథం కూడా చేసేశారు.  అయితే ఆయనకు సొంత ఇంటి నుంచే వ్యతిరేక సెగ తగిలింది. ఆయన కుమార్తె స్వయంగా తన తండ్రిని నమ్మకండి అంటూ జనాలకు ఓ వీడియో సందేశం ఇచ్చారు. తన తండ్రి జగన్ చేతిలో పావుగా మారి అనవసరంగా జనసేనాని పవన్ కల్యాణ్ ను తిడుతున్నారు. అది కరెక్టు కాదు అంటే ఆ వీడియోలో పేర్కొన్న ముద్రగత కూతురు తన ఓటు పవన్ కల్యాణ్ కే అని ప్రకటించారు. దీంతో కూతురిపై ముద్రగడ ప్రాపర్టీ వ్యాఖ్యలు చేసి పరుపు పోగొట్టుకున్నారు.  సొంత కుమార్తే ముద్రగడను నమ్మడం లేదు.. ఇక ప్రజలెందుకు ఆయనను విశ్వసిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్ధి, ఉపముఖ్యమంత్రి  బూడి ముత్యాలరాజు ఇంటి పోరు కూడా రచ్చకెక్కింది.  ఆ కథేంటంటే ఆయనకు ఇద్దరు భార్యలు.  మొదటి భార్య కొడుకు బూడి రవికుమార్. ఆయన  మా నాన్న ముత్యాలనాయుడుకు ఓటేయకండి. సొంత కుటుంబానికే న్యాయం చేయని వాడు ప్రజలకేం చేస్తాడంటూ రోడ్డెక్కారు.  పాపం ఆయనా ఇంటి పోరు కారణంగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో ప్రజల విశ్వాసం పొందలేక ఎదురీదుతున్నారు. 

ఇక తాజాగా సత్తెన పల్లి వైసీపీ అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు ఇంట్లోనూ ఇంటి పోరు రచ్చకెక్కింది. ఆయన కుమార్తె భర్త తన మామ నీచుడు, నికృష్ణుడు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సత్తెన పల్లి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.  ప్రత్యర్థి నేతలపై  నోరు పారేసుకునే అంబటి ఇప్పుడు సొంత అల్లుడు తనపై చేసిన విమర్శలపై నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు.   మొత్తంగా వైసీపీ అధినేత నుంచి ఆ పార్టీ కీలక నేతల వరకూ సొంత ఇంటి నుంచే ఎదురౌతున్న వ్యతిరేకతతో  సతమతమౌతున్నారు. సొంత ఇంటి కుంపట్లే నిరసన నిప్పులు చెరుగుతుంటే ఏం చేయాలో తెలియక సతమతమౌతున్నారు.