రచయిత అంటే సినిమా రంగంలో చిన్నచూపు...

 

భారతీయ సినిమా రంగంలో రచయితలంటే చిన్నచూపు అని ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు, రచయిత రమేష్ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకి సంబంధించినంత వరకు రచయితే ఆద్యుడని, అయితే చిన్నచూపును, నిర్లక్ష్య ధోరణిని ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా రచయితేనని ఆయన అన్నారు. దర్శకులు సినిమాకి సంబంధించిన క్రెడిట్ మొత్తం తమ ఒక్కరికే దక్కాలని ఆలోచిస్తూ వుండటం వల్ల రచయితకు గౌరవం దక్కడం లేదని ఆయన అన్నారు. సినిమా రచయితకు గౌరవంతో పాటు డబ్బు కూడా సరిగా దక్కడం లేదని ఆయన అన్నారు. ‘‘మన దగ్గర మంచి రచయిత ఉంటే అతడికి రాసే అవకాశం ఇవ్వాలి. నాలుగు రూపాయల కోసమో, కీర్తి కోసమో వాళ్ల అవకాశాలు లాక్కోవడం సరికాదు. నేనెప్పుడూ ఇతరుల శాఖల్లో వేలుపెట్టను అని రమేష్ అరవింద్ చెప్పారు.