రైల్వే బడ్జెట్ గమ్యం మారింది
posted on Jan 20, 2023 12:47PM
బడ్జెట్ అనగానే సహజంగా, సాధారణ బడ్జెట్ గురించే ఆలోచిస్తారు, కానీ, రైల్వే బడ్జెట్ గురించి పెద్దగా పట్టించుకోరు. సాధారణ బడ్జెట్ ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడుతుంది. సాధారణ బడ్జెట్ ప్రభావంతో పప్పు ఉప్పు మొదలు, చుట్టా బీడీ దాకా అన్నిటి ధరలు పెరుగుతాయనే భయం సామాన్యులను సహజంగా వెంటాడుతుంది. అంతే సహజంగా ప్రజల జీవన ప్రమాణాలపై సాధారణ బడ్జెట్ ప్రభావం ఉంటుంది.
సాధారణ బడ్జెట్ కు ఉన్న ప్రాధాన్యత రైల్వే బడ్జెట్ కు లేక అపోవడానికి అదొక కారణం అయితే, గతంలో ఎప్పుడూ రైల్వే బడ్జెట్ కు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు పెద్దగా లేక పోవడం మరొక కారణం కావచ్చును. అయితే, ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం సుస్థిర ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తోది. ముఖ్యంగా రవాణా వ్యవస్థను పటిష్ట పరిచేందుకు రోడ్డు, జల, వాయు మార్గాలతో పాటుగా రైలు మార్గాల విస్తరణ, ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. అందుకే, ఇటీవల కాలంలో రైల్వే బడ్జెట్ కూడా చర్చకు వస్తున్నది.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. దీంతో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే ఛార్జీలు.. తదితర విషయాలపై అందరిలోనూ ఈ బడ్జెట్ ఆసక్తిని నింపుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో వందే భారత్ రైళ్లు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే మూడేళ్లలో 400 సెమీ హైస్పీడ్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించినట్లు గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు వీటిపై ఏం చర్యలు తీసుకుంటారన్నదని ఆసక్తిగా మారింది.
భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బడ్జెట్‌ను పెంచే అవకాశాలు ఉన్నాయి. రైల్వేలకు కేటాయింపులు ప్రస్తుత సంవత్సరంలో రూ. 1.4 లక్షల కోట్లుగా ఉండగా అది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 30 శాతం పెంచి రూ. 1.9 లక్షల కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.45 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూలధన వ్యయం రూ. 3 ట్రిలియన్లకు అంటే 20 శాతానికి పైగా పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
2024 మొదటి క్వార్టర్‌లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వందే భారత్ రైలు రీవ్యాంప్డ్ స్లీపర్ వెర్షన్ గురించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు ప్రకటించిన దానికి మించి ఈ ఏడాది బడ్జెట్‌లో మరో 400 కొత్త వందే భారత్ రైళ్ల ప్రణాళికలను ప్రభుత్వం ఆవిష్కరించే అవకాశం ఉంది. రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్దీ ఎక్స్‌ప్రెస్‌లు సహా అన్ని హైస్పీడ్ రైళ్లను ఒక్కొక్కటిగా పక్కన పెట్టి వాటి స్థానంలో అన్ని చోట్లా వందే భారత్ రైళ్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచనలో ఉంది. ప్రధాన మార్గాల్లో వేగాన్ని గంటకు 180 కిలోమీటర్ల స్థాయికి పెంచాలని చూస్తోంది.
2026 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశం స్టాండర్డ్-గేజ్ వందే భారత్ రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇటీవల చెప్పారు. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే 180 కిమీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో రైళ్లను తయారు చేయగల సామర్థ్యం ఉన్న ఎనిమిది దేశాల సరసన భారత్ చేరుతుంది. 2025-2026 నాటికి యూరప్, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాలోని మార్కెట్‌లకు ఎగుమతి చేయడానికి రైళ్లను తయారు చేయాలని కూడా రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే, బహుశా చరిత్రలో మొదటి సారి రైల్వే బడ్జెట్ కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు ఎవరు రైల్వే మత్రిగా ఎవరున్నా.. రైల్వే బడ్జెట్ లో సింహ భాగం మంత్రి వర్యుని స్వరాష్రాతునికి వెళ్ళిపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఆ దృక్పథం మారింది ..వార్షిక బడ్జెట్ కు అనుబంధంగా ఆర్థిక మత్రిత్వ శాఖ రైల్వే బడ్జెట్ రూపొందించడంతో బడ్జెట్ బరువుతో పాటుగా దృక్పథం కూడా మారింది ... జాతీయ దృక్పథం ప్రాధాన్యత సంతరించుకుంది.