మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ డుమ్మా.. కారణమేంటంటే?

రాజకీయ నాయకులలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది ఓ ప్రత్యేక శైలి. అవసరార్ధం ఆయన ఎంతకైనా తెగిస్తారు.. ఎంతకైనా దిగజారుతారని రాజకీయవర్గాలలో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఒక సారి కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఆ తరువాత తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇదేమిటని అడిగిన వారికి తన లక్ష్యం తెలంగాణ సాధన.. ఆ లక్ష్య సాధన కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దెట్టుకుంటా అని సమాధానం ఇచ్చారు. సరే సుదీర్ఘంగా ఆయన నాయకత్వంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమ ఫలితమైతేనేం, కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధి కోసమైతేనేం తెలంగాణ సాకారమైంది. ఇది జరిగి పదేళ్లు దాటింది. 

తెలంగాణ సాకారమైన సమయంలో కేసీఆర్ సకుటుంబ  సపరివార సమేతంగా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి కృతజ్ణతలు తెలిపి మరీ వచ్చారు. అంతకు ముందు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కూడా అన్నారు. అయితే తెలంగాణ ఆవిర్బావం తరువాత వరుసగా పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేటీఆర్.. ఆ సమయంలో  కాంగ్రెస్ ను రాష్ట్రంలో నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదిపారు. సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సహయంలోనే  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి ప్రధాని మన్మోహన్: నేతృత్వంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాని మన్మోహన్ సింగ్ కారణం. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా చెప్పారు. మన్మోహన్ మృతికి సంతాపం తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ అందించిన సహకారాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదని పేర్కొన్న కేసీఆర్ మన్మోహన్ అంత్యక్రియలకు మాత్రం హాజరు కాలేదు. తనకు బదులుగా తన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి అయిన కేటీఆర్ నేతృత్వంలోని ఒక బృందాన్ని పంపారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు సహా రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ స్వయంగా హాజరై ఉండాల్సిందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

అయితే కేసీఆర్ సీతయ్య లాంటి వారు. ఎవరి మాటా వినరు. తనకు ఏది తోస్తే అదే చేస్తారు. గత ఏడాది ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచీ కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. అలాగని పూర్తిగా రాజకీయ సన్యాసం చేయలేదు. తాను కలవాలనుకున్నప్పుడల్లా పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని గంటల తరబడి మంతనాలు జరుపుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ సమయానికి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు  కేసీఆర్ గైర్హాజర్ కావడం ఏ మాత్రం హుందాగా లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. పరాజయంతో ముఖం చెల్లకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. మన్మోహన్ అంత్యక్రియలకు సైతం దూరంగా ఉండటానికి కారణం ముఖ్యమంత్రి హోదాలో  ఉన్న రేవంత్ ను ఫేస్ చేయడానికి ఇష్టపడకపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అలాగే తాను సీఎంగా ఉండగా ప్రొటోకాల్ ను సైతం ధిక్కరించి ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సమయంలో ఆయనకు స్వాగతం పలకలేదు. ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ పరిశీలకులు ఇప్పుడు మోడీకి ఎదురుపడి అవమానపడటం కంటే దూరంగా ఉండటమే మేలని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు. మొత్తం మీద మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ గైర్హాజర్ కావడం ఆయన ప్రతిష్టను మరింత మసకబార్చిందని అంటున్నారు.