వైసీపీకి మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా

మాజీ ఐఏఎస్ అధికారి  ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. కన్ ఫర్డ్ ఐఏఎస్ అయిన ఇంతియాజ్ అహ్మద్ గత ఎన్నికలకు ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకుని మరీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 

తొలి నుంచీ వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ముద్రపడిన ఇంతియాజ్ అహ్మద్   వైసీపీ హయాంలో   కీలక జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా ఇంతియాజ్ అహ్మద్ కు ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చే వారు. అటువంటి ఇంతియాజ్ అహ్మద్ తనకు ఎన్నికలలో పోటీ చేయాలని ఉందన్న ఆసక్తి కనబరచగానే జగన్ ఓకే అనేశారు. అంతే ఆఘమేఘాల మీద  వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ గూటికి చేరిపోయారు. కర్నూలు, లేదా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే చివరకు జగన్ ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టి కర్నూలు నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు.

అయితే ఇంతియాజ్ అహ్మద్ ఓడిపోవడం, అలాగే వైసీపీ కూడా అధికారంలోకి రాకపోవడంతో జగన్ ఇంతియాజ్ అహ్మద్ ను పట్టించుకోవడం మానేశారు.  దాంతో పార్టీ నుంచి కూడా ఆయనకు ఎటువంటి సహకారం అందడం లేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు.