పురందేశ్వరి పగ చల్లారదా?
posted on Nov 2, 2015 1:02PM

ఎన్టీఆర్ గారి అమ్మాయి, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి గారికి తన మరిదిగారు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద పగ చల్లారినట్టు లేదు. తమ కుటుంబ గొడవలు, పగలను తీర్చుకోవడానికి ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉపయోగించుకోవడం మానినట్టు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీలో తన భర్త దగ్గుబాటి వేంకటేశ్వరరావును రెండో స్థానానికే పరిమితం చేశారన్న కోపంతోపాటు ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్‌ని పదవీచ్యుతుడిని చేశారన్న ఆగ్రహం పురందేశ్వరికి ఎప్పటి నుంచో వుంది.ఆ కోపాన్ని ఆమె అడపాదడపా ప్రకటిస్తూనే వుంటారు.
అయితే ఒకవిధంగా చెప్పాలంటే, రాజకీయాలంటేనే తెలియని పురందేశ్వరి కేంద్ర మంత్రిపదవి వరకూ ఎదిగారంటే దానికి కారణం పరోక్షంగా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ కుటుంబం నుంచి రాజకీయ శక్తిని తయారు చేయాలన్న మేడమ్ సోనియా ఆలోచన ఫలితంగానే ఆమె కేంద్ర మంత్రి పదవిని పొందగలిగారు. అయితే సోనియాగాంధీ ఆశించిన స్థాయిలో పురందేశ్వరి ప్రజల మనసులలో స్థానం సాధించుకోలేకపోయారు. రాష్ట్ర విభజనకు తనవంతు సహకారాన్ని అందించి తెలుగు ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ఫలితం రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ నాయకురాలిగా ఊహించని పరాజయం.
అయితే తన ఓటమికి చంద్రబాబు నాయుడు చేసిన రాజకీయమే కారణమన్న అభిప్రాయం పురందేశ్వరికి బలంగా వుంది. గతంలో చంద్రబాబు నాయుడి మీద వున్న కోపాన్ని ఈ అభిప్రాయం మరింత పెంచింది. రాజంపేటలో ఓటమి తర్వాత ఆమె రాజకీయాలకు తాత్కాలిక విశ్రాంతినిస్తే బావుండేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులకు పెద్ద పనేమీ లేదు. అధికార తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాల్సిన అవసరం లేదు. అయితే బీజేపీలో వున్న పురందేశ్వరి మాత్రం తెలుగుదేశం పార్టీలో బీజేపీకి ఉన్న మిత్రధర్మాన్ని పక్కన పెట్టి తమ కుటుంబ గొడవలకు ప్రాధాన్యం ఇస్తూనే వున్నారు. వీలైనప్పుడల్లా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేస్తూనే వున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన కృషి చేయడం లేదనే అర్థం వచ్చే విధంగా ఈమధ్య కొన్నిసార్లు మాట్లాడారు. అక్కడితో ఆగారా... తాజాగా ఏపీలో బీజేపీ బలం పుంజుకుంటోందని, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఏపీలో తెలుగుదేశం పార్టీదే వచ్చే ఎన్నికలలో అధికారం అని చెబుతూ వుంటే, పురందేశ్వరి వచ్చే ఎన్నికలలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని చెబుతూ వున్నారు. పురందేశ్వరి చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఆమెలోని పగకు ప్రతిరూపాలా? లేక బీజేపీ నాయకత్వం ఆదేశానికి ప్రతీకలా? ఏమో... ఆమెకే తెలియాలి!