జనవరిలోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ఎందుకంటే....

 

సుమారు ఏడాది క్రితం నిర్వహించాల్సిన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను తెలంగాణా ప్రభుత్వం నేటి వరకు నిర్వహించలేదు. హైకోర్టు దాని గురించి ప్రశ్నించినపుడల్లా వార్డుల పునర్విభజన, ఆధార్ కార్డుల తో ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియ కోసమేనని చెపుతూ హైకోర్టు నుంచి గడువు సంపాదించుకొంటోంది. మళ్ళీ ఇవ్వాళ్ళ హైకోర్టు ప్రశ్నించినపుడు కూడా అవే సమాధానాలు చెప్పి జనవరి వరకు గడువు కోరింది. ఈసారి జనవరిలో తప్పకుండా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహిస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీని లిఖిత పూర్వకంగా అఫిడవిట్ ద్వారా సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.

 

వార్డుల పునర్విభజన కోసం సుమారు 12నెలలు సమయం తీసుకొన్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం ఆ పని పూర్తి చేయనేలేదు. కానీ ఆధార్ అనుసంధానం పేరుతో సుమారు ఆరున్నర లక్షల మంది ఓటర్లను ఏరి పడేసింది. వారిలో అత్యధిక శాతం ఆంధ్రాకు చెందినవారే. కేంద్ర ఎన్నికల సంఘం, హైకోర్టు తెలంగాణా ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చి ఉండి ఉంటే మిగిలిన వాళ్ళ పేర్లను కూడా ఓటర్ల జాబితాలో నుంచి తొలగించి ఉండేదేమో కానీ కుదరలేదు. పైగా ఎన్నికల కమీషన్ పంపిన అధికారులు చివాట్లు పెట్టారు. ఇంతకాలం జి.హెచ్.ఎం.సి. కమీషనర్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ ని బదిలీ చేసి తెరాస ప్రభుత్వం చేతులు దులుపుకొంది.

 

ఇక ఎలాగూ ఎన్నికల నిర్వహించక తప్పదు కనుక జనవరి నెలాఖరులోగా నిర్వహిస్తామని మత ఇస్తోంది. అయితే జనవరిలోనే ఎందుకు అంటే బహుశః అప్పుడే సంక్రాంతి పండుగకానీ జంట నగరాలలో ఉన్న ఆంధ్రా ప్రజలు అందరూ తమతమ ఊళ్లకు వెళ్ళిపోతారు కనుక అని అనుకోవలసి ఉంటుంది. తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆ ఆంధ్రా ఓటర్ల కారణంగానే గెలుస్తుంటాయి. వాళ్ళు వెళ్ళిపోతే ఇక మిగిలిన స్థానికులు తెరాసకే ఓట్లు వేస్తారు కనుక జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలిచేఅవకాశాలు ఉంటాయని తెరాస భావిస్తోందేమో? బహుశః అదే తెరాసకు మిగిలిన చిట్ట చివరి అవకాశం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu