ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి.. నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు 

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ ను పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. అయితే కేసులో ఎలాంటి పురోగతి సాధించకపోవడానికి ప్రధాన కారణం  ప్రధాన నిందితులు విదేశాల్లో ఉండటమే. వారు తిరిగి వస్తే కానీ దర్యాప్తు ముందుకు సాగదు. ప్రధాన నిందితులైన ఎస్ ఐబి మాజీ ఓ ఎస్టీ ప్రభాకర్ రావు,  మరో కీలక నిందితుడు అరువెల్ల శ్రవణ్ రావ్ లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి .ఇంటర్ పోల్ నుంచి సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడికి సమాచారమందడంతో హైద్రాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వీరిరువురిని అదుపులో తీసుకుని కేంద్రానికి అప్పగించే పనిలో ఇంటర్ పోల్ ఉంది. వారిద్దరిని సాధ్యమైనంత త్వరగా ఇండియా తీసుకురావడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైద్రాబాద్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీరిద్దరిని అమెరికాలో తాత్కాలిక (ప్రొవిజినల్ ) అరెస్ట్ చేసి డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా ఇండియా పంపే అవకాశం ఉంది. ప్రొవిజినల్ అరెస్ట్ ను నిందితులు అక్కడి కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా ప్రొవిజినల్ అరెస్ట్ అని నిందితులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశం లేకపోలేదు.