రేవంత్ టార్గెట్ గా కేసీఆర్ బిగ్ స్కెచ్.. కారెక్కనున్న పొన్నం ప్రభాకర్? 

గులాబీ గూటికి గుడ్ బై చెప్పేసి బీజేపీకి జై కొట్టిన ఈటల రాజేందర్.. కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగస్టు9 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. కేసీఆర్ లక్ష్యంగానే ఆయన యాత్ర సాగనుంది. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల కూడా త్వరలో పాదయాత్ర చేయబోతోంది. దొర పాలనకు చరమగీతం పాడుతానంటూ ఆమె హాట్ కామెంట్స్ చేస్తోంది . ఇక ఫైర్ బ్రాండ్ లీడర్ ఎంపీ రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా మరింత దూకుడు పెంచారు. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. రోజుకో సంచలన ప్రకటనతో బాంబులు పేల్చుతున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.

విపక్షాలన్ని యాక్టివ్ కావడంతో గులాబీ పార్టీలో గుబులు కనిపిస్తోందని తెలుస్తోంది. గత ఏడేళ్లుగా సరైన ప్రతిపక్షం లేకపోవడంతో కేసీఆర్ ఆడిందే ఆటగా మారింది. కాని ఇప్పుడు సీన్ మారడంతో కేసీఆర్ కూడా అలర్టైనట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన రూట్ మార్చుకుని జనంలో వెళుతున్నారు. తాజాగా ఆయన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారని, విపక్షాలను వీక్ చేసే వ్యూహాలు రచిస్తున్నారని  అంటున్నారు. అందులో భాగంగానే మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారని చెబుతున్నారు. కేసీఆర్ యాక్షన్ తో వలసలు కూడా మొదలయ్యాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రమణ త్వరలోనే కారెక్కనున్నారు. ఆయన బాటలోనే మరికొందరు టీడీపీ నేతలు గులాబీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 

రేవంత్ రెడ్డి రాకతో జోష్ మీదున్న కాంగ్రెస్ పై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లను కారెక్కించి రేవంత్ రెడ్డికి ఆదిలోనే షాక్ ఇవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతను  టీఆర్ఎస్ లో చేర్చుకునేలా పావులు కదుపుతున్నారని సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను గులాబీ గూటికి రావాలని ఆహ్వానించినట్లు, ఆ చర్చలు ఫలించినట్లు చెబుతున్నారు. మొన్నటి వరకు టీపీసీసీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పొన్నం... రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇచ్చాకా కొంత సైలెంట్ అయ్యారని అంటున్నారు. రేవంత్ రెడ్డితో మొదటి నుంచి పొన్నంకు సఖ్యత లేదంటారు. ఇదే అదనుగా రంగంలోకి దిగిన గులాబీ లీడర్లు.. అతనితో మాట్లాడి కారు పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని తెలుస్తోంది. పొన్నం కూడా మంత్రి కేటీఆర్ తో రెండు సార్లు చర్చించారని చెబుతున్నారు. 

పొన్నం ప్రభాకర్ బీసీ నేతగా కాంగ్రెస్ లో కీలక పదవులు దక్కించుకున్నారు. దివంగత వైఎస్సార్ కు సన్నిహితుడిగా పేరున్న పొన్నంకు పార్టీలోని మరో బలమైన బీసీ నేత మధుయాష్కి గౌడ్ తో మొదటి నుంచి విభేదాలున్నాయి. పొన్నం వైఎస్సార్ వర్గంలో ఉండగా.. యాష్కి మాత్రం వైఎస్ వ్యతిరేక వర్గంలో ఉన్నారు. ప్రస్తుత కమిటీలో  పొన్నంకు ఏ పదవి రాకపోగా.. మధుయాష్కికి మాత్రం ప్రచార కమిటి చైర్మన్ పోస్టు దక్కింది. అటు రేవంత్ రెడ్డితోనూ పొన్నంకు మంచి సంబంధాలు లేవు. అందుకే ప్రతి విషయంపైనా వెంటనే స్పందించే పొన్నం... కొన్ని రోజులుగా మాట్లాడటం లేదు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న పొన్నం.. దీంతో టీఆర్ఎస్  ఆహ్వానానికి  సానుకూలంగానే స్పందించారని చెబుతున్నారు. త్వరలోనే పొన్నం కారు పార్టీ గూటికి చేరవచ్చని కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు కూడా చెబుతున్నాయి. టీఆర్ఎస్ నేతలైతే పొన్నం గులాబీ గూటికి చేరడం ఖాయమంటున్నారు. 

ఈటల రాజేందర్ రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇది కరీంనగర్ లోక్ సభ పరిధిలోనే ఉంది. కరీంనగర్ ఎంపీగా పని చేసిన పొన్నంకు హుజురాబాద్ తోనూ మంచి సంబంధాలున్నాయి. ఉప ఎన్నికలో ఇది తమకు కలిసివస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పొన్నం ప్రభాకర్ అభ్యర్థి అయినా ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తోంది. బీసీ నేతగా గుర్తింపు ఉన్న ఈటలను ఎదుర్కొవడానికి మరో బలమైన బీసీ నేత బాగుంటుందనే యోచనలో గులాబీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.  మొత్తానికి పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ లో చేరితే తెలంగాణ రాజకీయాల్లో అదో కీలక పరిణామంగా మారుతుందని  రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.