మోడీ టీంలో 42 శాతంపై క్రిమినల్ కేసులు.. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దేశమంతా గాలించి, శోదించి ఆణిముత్యాలను ఏరుకొచ్చి, మంత్రివర్గాన్ని ఏర్చికూర్చారని, మీడియాలో, సోషల్ మీడియాలో పేరు మోసిన పెద్దలు చాలా మంది చాలా రకాల విశ్లేషణలు చేశారు. అయితే, పొట్ట విప్పి చూస్తే..అసలు గుట్టు బయట పడిందని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడీఅర్, సంస్థ, మోడీ కాబినెట్ రియల్ కలర్స్  బయట పెట్టింది. 

భారీ విస్తరణ తర్వాత మోడీ మంత్రివర్గంలో మొత్తం సభ్యుల సంఖ్య 78కి చేరింది. ఇందలో 42 శాతం మంది ఫై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ తాజా నివేదిక తేల్చి చెప్పింది. ఇందులో నలుగురి మీద హత్యాయత్నం కేసులున్నాయని, ఏడీఆర్ నివేదిక పేర్కొంది.అంతే, కాదు, ఈ నివేదికకు ఆధారం, ఇక్కడా అక్కడా పోగేసిన గాలి కబుర్లు కాదు. ఆ మంత్రులు  ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆఫిడవిట్’లో స్వయంగా స్వహస్తాలతో  పొందుపరిచిన వివరాల ఆధారంగా ఏడీఆర్ నివేదికను రూపొందించింది. 

ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం, మోడీ నూతన మంత్రివర్గంలో 78 మందిలో 33మంది (42శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్న విషయన్ని అఫిడవిట్’లో పేర్కొన్నారు, అందులో 24 మంది (మొత్తం సభ్యులలో 31 శాతం)తమ మీద ’సీరియస్’ క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు. అందులో, హత్య, హత్యా యత్నం, దొంగతనం వంటి హేయమైన కేసులు కూడా ఉన్నాయి.  ఎన్నికల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ఏడీఆర్ సంస్థ ఎన్నికల ముందు తర్వాత కూడ పోటీలో ఉన్న అభ్యర్ధుల నేర చరిత్ర, ఆర్థిక స్థితిగతులు,విద్యార్హతలు,వ్యాపారలావాదేవీలు వంటి సమాచారాన్ని నివేదికల రూపంలో పబ్లిష్ చేస్తుంది. 

మోడీ కాబినెట్ నేరచరిత అలా ఉంటే ఆయన మంత్రులలో కుబేరులకు కొదవ లేదు. మొత్తం  78 మందిలో 70 మంది కోటీశ్వరులు. ఇందులో ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా కాబినెట్ మొత్తానికి కుబేరుడు. అయన ప్రకటిత ఆస్తులే రూ. 379 కోట్లు, ఆయన తర్వాత పీయూష్ గోయెల్ రూ.95 కోట్ల సంపన్నుడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మోడీ మంత్రివర్గంలో కాబినెట్ మంత్రి నారయణ రాణే ఆస్తుల విలువ రూ.87కోట్లు. అలాగే, రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటిత ఆస్తులు రూ.64కోట్లు. ఈ నలుగురు అతి సంపన్నులు. అయితే మిగిలినవారిలోనూ కోట్లకు పడగలెత్తిన కుబేరులే ఎక్కువ. సగటున చూస్తే ఒక్కొక్క మంత్రి ఆస్తుల విలువ రూ.16.24 కోట్లని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.

అందరికంటే తక్కువ ఆస్తులు ఉన్న మంత్రి ప్రతిమ భౌమిక. త్రిపురకు చెందిన ఈమె చరస్థిర ఆస్తుల విలువ కేవలం రూ .6 లక్షలు. అలాగే, కేంద్ర మంత్రి వర్గంలోస్థానం సంపాదించుకున్న పశ్చిమ బెంగాల్ బడిపంతులు జాన్ బార్లా ఆస్తులు 14 లక్షలు. అలాగే,ఇంకో ముగ్గురు నలుగురు మంత్రుల ఆస్తులు కూడా  లక్షల్లోనే ఉన్నా, కుబేరులకు కొదువలేదు.