కబుర్లు వద్దు, పని మొదలుపెట్టండి: పొన్నాల

 

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తరువాత కోటి ఆశలతో ప్రజలు తెరాసకు పట్టం కట్టారు. కానీ అధికారం చేప్పట్టినప్పతి నుండి నేటి వరకు పొరుగు రాష్ట్రమయినా ఆంద్రాతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, ప్రతిపక్ష పార్టీలని బలహీన పరిచేందుకు ఆ పార్టీలలో నేతలను ఆకర్షించడం, హైకోర్టు చేత నిత్యం మొట్టికాయలు వేయించుకోవడం, ఏదో ఒక వివాదస్పద నిర్ణయాలు ప్రకటిస్తూ దానిపై వాదోపవాదాలు చేస్తూ కాలక్షేపం చేయడం తప్ప ఏడాదిన్నర కావస్తున్నా పరిపాలనపై సరిగ్గా దృష్టి పెట్టడం లేదని తెలంగాణా మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పధకాలను అర్హులకు అందించడానికే అంటూ ఏడాది క్రితం ఆర్భాటంగా తెలంగాణా సమగ్ర సర్వే జరిపించి దానితో ఏమి సాధించారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడం చేతకాకనే ప్రజల, ప్రతిపక్షాల దృష్టిని మళ్ళించేందుకు ఏదో ఒక వివాదాస్పద నిర్ణయాలు ప్రకటిస్తూ కేసీఆర్ రోజులు దొర్లించేస్తున్నారని పొన్నాల విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మళ్ళీ కొత్త ప్రాజెక్టులను కడతామని చెపుతూ ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని పొన్నాల విమర్శించారు. ఇప్పటికే ఏడాదిన్నర సమయం గడిచిపోయిందని ఇకనుండయినా పరిపాలనపై దృష్టిపెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెడితే బాగుంటుందని పొన్నాల కేసీఆర్ కి సూచించారు.

 

కానీ తమ తెరాస ప్రభుత్వం ఇదివరకు ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా చాలా వేగంగా, అద్భుతంగా రాష్ట్రాభివృద్ధి చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మంత్రులందరూ గట్టిగా వాదిస్తున్నారు. తమ ప్రభుత్వం చురుకుగా పనిచేస్తున్న తీరుచూసి కాంగ్రెస్ పార్టీ నేతలు తమ భవిష్యత్ గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నందునే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని తెరాస నేతల వాదన. వారి వాదోపవాదాలు ఎలాగా ఉన్నప్పటికీ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి వాదనలు సరయినవో ప్రజలే ఎలాగూ తీర్పు చెపుతారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu