గేమ్ ఛేంజర్ చుట్టూ పొలిటికల్ వార్.. వైసీపీ నేతలపై మెగా ఫ్యాన్స్ ఫైర్!
posted on Jan 7, 2025 8:28AM
ఏపీలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సరిగ్గా కూటమి పార్టీలు గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా, వైసీపీ అధిష్టానం తీరు మారడం లేదు. ఆ పార్టీలోని కొందరు నేతలు ప్రవర్తిస్తున్న తీరుపట్ల వైసీపీ శ్రేణులే తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. రెండు రోజుల క్రితం రాజమండ్రి వేదికగా గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో హీరోగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. ఈ వెంట్ కు ముఖ్యఅతిథిగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అయితే, పవన్ తన ప్రసంగంలో ఈవెంట్లో పాల్గొన్న మెగా ఫ్యాన్స్‌కు ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని పదేపదే సూచించారు. అయితే దురదృష్టవ శాత్తూ ఈవెంట్ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో రాత్రివేళ ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ ఇద్దరు యువకుల మృతిని రాజకీయం చేసేందుకు వైసీపీ నేతలు పడరానిపాట్లు పడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్నారు. దీంతో ఇదేం పార్టీరా బాబూ అంటూ వైసీపీ కార్యకర్తలే తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.
గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన సాగించాడు. రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి దోచుకోవటం, దాచుకోవటమే పాలన అన్నట్లుగా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని తన అరాచకత్వంతో అన్ని విధాలుగా భ్రష్ఠు పట్టించారు. జగన్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పారు. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్షంగా ఉండే అర్హత కూడా లేదని తమ తీర్పు ద్వారా తేటతెల్లం చేశారు. దీనికి ప్రధాన కారణం వైసీపీలోని కొందరు నేతలు నోటికొచ్చినట్లు బూతులతో ప్రత్యర్థి పార్టీల నేతలను తూలనాడటం, ప్రభుత్వం తీరును ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేసి జైళ్లకు పంపడం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. కానీ, వైసీపీలోని కొందరు నేతల తీరు మాత్రం మారలేదు. అవసరంలేని విషయాలను రాజకీయం చేయాలని చూస్తుండటంతో వారిపట్ల సొంత పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన వెళ్తుండగా.. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన మణికంఠ, చరణ్ అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే చనిపోయిన ఇద్దరు యువకుల కుటుంబాలకు నిర్మాత దిల్ రాజు, పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఇదే క్రమంలో గత వైసీపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయిందని.. గత అయిదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. పాడైపోయిన ఈ రోడ్డును ప్రస్తుతం బాగు చేస్తున్నామన్నారు. అయితే, ఈ దశలో ఏడీబీ రోడ్డుపై ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు చనిపోయారని తెలిసి ఆవేదనకు లోనయ్యానంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట‌్ పై వైసీపీ నేతలు రోజా, అంబటి రాంబాబులు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.
పవన్ ట్వీట్‌కు రోజా స్పందిస్తూ.. మానవత్వం మరిచి నిందలేస్తారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో పుష్ప టీమ్ మానవత్వంతో వ్యవహరించలేదన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని వెళ్తుండగా ఇద్దరు యువకులు మరణించి మూడు రోజులైనా వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణమంటూ రోజా ట్వీట్ చేశారు. వీరి మరణానికి గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వెయ్యకపోవడం కారణం అంటూ రాజకీయం చెయ్యడం తగునా పవన్ కళ్యాణ్ అంటూనే.. ఏడు నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీరే.. రోడ్డు వేయకుండా మరి మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ.. పుష్ప సినిమాకు ఏమో నీతులు, గేమ్ ఛేంజర్‌కు పాటించరా అంటూ ట్వీట్ చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ వ్యవహారం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైసీపీ నేతల విమర్శలపై జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
పుష్ప-2 సినిమా సందర్భంగా జరిగిన ఘటనకు ఒక న్యాయం.. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చివెళ్తూ మరణించిన వారికి ఒక న్యాయమా..? అంటూ రోజా, అంబటి రాంబాబులు ప్రశ్నించారు. ఇక్కడ విషయం ఏమిటంటే.. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ తొక్కిసలాట ఘటన హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడం వల్ల జరిగింది. అయినా, ఆ ఘటన జరిగింది తెలంగాణలో.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసింది రేవంత్ సర్కార్. కానీ వైసీపీ నేతలు మాత్రం తెలంగాణలో జరిగిన పుష్ప-2 ఘటనతో.. ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటనను పోల్చడంపై జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వైసీపీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మొత్తానికి గేమ్ ఛేంజర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ హీట్‌కు కారణమైంది.