పిల్ల సజ్జలపై లుక్ ఔట్ నోటీసు
posted on Nov 12, 2024 5:08PM
వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ ఇన్ చార్జ్ సజ్జల భార్గవ రెడ్డిపై కడప జిల్లా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి. జగన్ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ముఖంలా, గొంతులా వ్యవహరించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో సజ్జల డిఫాక్టో సీఎంగా పెత్తనం చెలాయించారు. ఆ పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ఉపయోగించుకునే సజ్జల వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను తన పుత్రరత్నం, పిల్ల సజ్జల అదేనండి సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు. దీంతో సజ్జల భార్గవరెడ్డి పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా సోషల్ మీడియా చేతిలో పెట్టుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రిపుంతలు తొక్కింది. అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయింది. సరే జగన్ సర్కార్ పతనమైన తరువాత సజ్జల భార్గవ రెడ్డి అయిపు లేకుండా పోయారు. సోషల్ మీడియాలో అసభ్య, అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు తాజాగా వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే.