ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును చంద్రబాబు ఎంపిక చేశారు. మంగళవారం (నవంబర్ 12) తెలుగుదేశం కూటమి శసనసభాపక్ష సమావేశంలో డిప్యూటీ స్వీకర్ పదవి కోసం పలువురి పేర్లను  పరిశీలించిన చంద్రబాబు చివరకు రఘురామకృష్ణం రాజు పేరును ఖరారు చేశారు. ఈ పదవి కోసం బుధ (నవంబర్ 13) లేదా గురు (నవంబర్ 14) వారాలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండటంతో ఈ పదవి కోసం మరెవరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణం రాజు ఎన్నిక లాంఛనం మాత్రమే.  ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవ్వడం ఖాయమనే చెప్పాలి.  

2019 ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం లోక్‌స‌భ స్థానం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీచేసి గెలిచారు. 2024 ఎన్నిక‌లకు ముందు ఆర్ఆర్ఆర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.  వైసీపీ రెబల్ ఎంపీగా రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ తప్పులను నిర్భయంగా ఎత్తి చూపారు.  దీంతో రఘురామకృష్ణంరాజును దారిలోకి తెచ్చుకోవడానికి జగన్ సామ, దాన, భేద, దండోపాయాలన్నిటినీ ఉపయోగించారు. అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం జగన్ అరాచక పాలనను, అస్తవ్యస్థ విధానాలను ఎండగడుతూనే ఉన్నారు. తన రచ్చబండ కార్యక్రమం ద్వారా జగన్ తప్పుడు విధానాలను ఉతికి ఆరేశారు. దీంతో రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు పాల్పడ్డారు. వీటన్నిటినీ తట్టుకుని ఆయన జగన్ అరాచక పాలనపై అలుపెరుగని పోరాటాన్ని సాగించారు. చివరకు 2024 ఎన్నికల ముందు ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.