ఇప్పుడేం ముఖం పెట్టుకొని వ‌స్తావ్‌ ఆళ్ళా!?

సినిమాల్లో స‌న్నివేశానికి త‌గ్గ‌ట్లుగా క‌మ‌ల్ హాస‌న్ త‌ర‌హాలో న‌టించేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు, కానీ,  వైసీపీ నేత‌లు క‌మ‌ల్ హాస‌న్ ను మించి న‌టించేస్తున్నారు. అంటే సినిమాల్లో కాదు, నిజ జీవితంలో, రాజకీయాలలో.  అలాంటి వారిలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ముందు వరుసలో ఉంటారు. త‌న‌కు ఎప్పుడు ఎలా అవ‌స‌ర‌మో ఆ విధంగా ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి న‌టించేస్తుంటారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన ఏపీ ప్ర‌జ‌లు.. క‌ర‌క‌ట్ట క‌మ‌ల‌హాస‌న్ పై మండిప‌డుతున్నారు. ఇటీవ‌ల వైసీపీని వీడి ఆళ్ల కాంగ్రెస్ లోకి వెళ్లిన విష‌యం తెలిసిందే.. ష‌ర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ష‌ర్మిల‌కు రాజ‌కీయంగా అంతా తానేనంటూ ఆళ్ల బిల్డ‌ప్ ఇచ్చారు. ఆళ్ల జ‌గ‌న్ కోవ‌ర్ట్ అనే విష‌యాన్ని గుర్తించిన ష‌ర్మిల ఆయనను దూరంపెట్టారు. ఇక కాంగ్రెస్ లో ఉన్నా కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ కొన‌సాగించ‌లేమ‌ని భావించిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కాంగ్రెస్ ను వీడి తిరిగి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోయారు. 

ఏపీలో  త్వరలో సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్య‌లో చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొంద‌రు నేత‌లు ఏరోజు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియ‌ని ప‌రిస్థితి.  నెల రోజుల క్రితం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరాడు. వైసీపీని వీడే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో త‌న అనుచ‌రుల‌తో ఆళ్ల భేటీ అయ్యారు. వైసీపీని వీడ‌టానికి కార‌ణాల‌ను వివ‌రించారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌రావ‌తి రాజ‌ధానికి భూములిచ్చిన‌ రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని, మూడు రాజ‌ధానుల పేరుతో అమ‌రావ‌తి ప్రాంత ప్ర‌జ‌ల‌ను మోసం చేశారని చెప్పుకొచ్చాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ మొహం పెట్టుకొని పోతామండీ అమ‌రావ‌తి ప‌రిధిలోని గ్రామాల‌కు అంటూ ఆళ్ల త‌న అనుచ‌రుల ముందు వాపోయారు. ఒక‌వైపు మూడు రాజ‌ధానులు అన‌గానే అమ‌రావ‌తి ప‌రిధిలోని భూముల ధ‌ర‌లు ప‌డిపోయాయి.. పిల్ల‌ల పెళ్లికో, చ‌దువుల‌కోస‌మో..  భూములు అమ్ముకుందామంటే రిజిస్ట్రేష‌న్‌లు కావ‌డం లేదంటూ క‌ర‌క‌ట్ట క‌మ‌ల‌హాస‌న్  ఓ ఉపన్యాసం దంచేసి, జగన్ తీరును ఎండగట్టారు. జ‌గ‌న్ అమ‌రావ‌తి ప్రాంత ప్ర‌జ‌ల‌ను మోసం చేశారనీ, అందుకే వైసీపీ వీడుతున్నాన‌ని చెప్పుకొచ్చారు. తాజాగా మ‌ళ్లీ అదే జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మ‌రోసారి ముఖ్య‌మంత్రిని చేద్దాం అంటూ ఆళ్ల చెబుతుండ‌టంతో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప్రాంతం ప్ర‌జ‌లు ఛీకొడుతున్నారు. అప్పుడు అలా అన్నావ్‌.. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని వైసీపీకి ఓటు వేయ‌మ‌ని అడుగుతావ్ అంటూ ఆయ‌న అనుచ‌రులే ప్ర‌శ్నిస్తున్నారు.  

ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్వీర్యంచేసే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. మూడు రాజ‌ధానుల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ.. అమ‌రావ‌తి పేరు లేకుండా చేయాల‌ని జ‌గ‌న్‌ కంక‌ణం క‌ట్టుకున్నాడు. జ‌గ‌న్ తీరును నిర‌సిస్తూ అమ‌రావ‌తి రాజ‌ధానికి భూములిచ్చిన‌ రైతులు నాలుగున్న‌రేళ్లుగా ఉద్య‌మం చేస్తున్నారు. కోర్టుల‌కువెళ్లి జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలను అడ్డుకుంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి రైతుల‌పై పోలీసులతో దాడులు చేయించ‌డం, అక్ర‌మంగా కేసులు పెట్టించ‌డం, అరెస్టులు చేయించ‌డం సైతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేశాడు. అయినా అమ‌రావ‌తి రైతులు ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌కుండా.. ఎండావాన అనే తేడాలేకుండా అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర‌వ్యాప్తంగా పాద‌యాత్ర‌ సైతం నిర్వ‌హించారు. జ‌గ‌న్ వ‌చ్చిన త‌రువాత అమ‌రావ‌తి రైతుల‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు. ఏపీ వ్యాప్తంగా అమ‌రావ‌తి రైతుల‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భించింది. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంత ప్ర‌జ‌లు, ముఖ్యంగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఏనాడూ మ‌ద్ద‌తుగా నిలిచిన దాఖ‌లాలు లేవు. ప్ర‌స్తుతం, ఎన్నిక‌ల స‌మ‌యంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని కోరుతూ ప్ర‌జ‌ల ముందుకొస్తున్నాడు. అమ‌రావ‌తి రాజ‌ధానిని జ‌గ‌న్ నిర్వీర్యం చేస్తున్నా రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన వారికి మ‌ద్ద‌తుగా నిల‌వ‌ని ఆళ్ల‌.. ఇప్పుడు ఏమొహం పెట్టుకొని ఓట్లు వేయ‌మ‌ని అడ‌గ‌టానికి వ‌స్తారంటూ మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ ఓట‌మిపాల‌య్యాడు. అయినా, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ వ‌స్తున్నారు. అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకొని పోతూ వారి స‌మ‌స్య‌ల్లో చేదోడు వాదోడుగాఉంటూ అండగా నిలుస్తున్నారు. దీంతో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని అన్నివ‌ర్గాల‌ ప్ర‌జ‌లు లోకేశ్ కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. కానీ,  గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి.. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఎలాంటి అభివృద్ధి చేయ‌క‌పోగా.. రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతుల ప‌క్షాన ఎన్నడూ మాట్లాడిన దాఖలాలు లేవు.   తాజాగా ఎన్నిక‌ల స‌మ‌యం రావ‌డంతో మ‌ళ్లీ వైసీపీ అభ్య‌ర్థిని గెలిపించాలంటూ, జ‌గ‌న్ ను మ‌రోసారి ముఖ్య‌మంత్రిని చేద్దామంటూ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. దీంతో మంగళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఆళ్ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ నిల‌దీసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు వేయ‌మ‌ని ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తాన్నావ్‌.. కొంచెమైనా నీకు సిగ్గూశ‌రం ఉందా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu