షర్మిలపైనా ఉక్కుపాదం!.. అంత భయమేంటి జగన్?!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన నీడను చూసి తానే వణికి పోతున్నారు. ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినా తన కుర్చీ మడతపడిపోతోందని భయపడుతున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఆయన ప్రతిపక్ష తెలుగుదేశం నేతలూ, కార్యకర్తలనే టార్గెట్ చేసుకుని వేధింపులకు పాల్పడ్డారు. ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడినా సహించలేకపోయారు. అయితే ఇప్పడు ఎన్నికల సమయం ముంచుకు వచ్చేసరికి ఆయనకు అందరూ శత్రువులుగానే కనిపిస్తున్నారు. తన అధికారాన్ని అంతం చేయడానికి బయలుదేరిన కుట్రదారులుగానే కనిపిస్తున్నారు. అందరినీ అణచివేయడానికి తనకున్న ఏకైక అండ పోలీసులేనన్న భావనలో పడిపోయారు. అందుకే చీమ చిటుక్కు మన్నా పోలీసులను రంగంలోకి దింపేస్తున్నారు. 
తాజాగా గురువారం ఉదయం  కాంగ్రెస్ చలో సెక్రటేరియెట్  కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ఒక యుద్ధ వాతావరణాన్నే సృష్ఠించారు. 
వాస్తవానికి గత పదేళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే నామమాత్రం. ఇప్పుడు కూడా ఆ పార్టీ గొంతు ఏదో కొద్దిగా వినిపిస్తోంది. అది కూడా జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతే ఏదో మేరకు కాంగ్రెస్ లో కొంత చలనం కనిపిస్తోంది. ఆ పార్టీలోకి చేరికలు ఉండే అవకాశాలూ మెరుగయ్యాయి. అంతే కానీ.. షర్మిల పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టగానే కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో అనూహ్య విజయాలు సాధించేసి అధికారం చేపట్టేస్తుందన్న పరిస్థితి ఇసుమంతైనా లేదు. కానీ జగన్  మాత్రం కాంగ్రెస్ ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయాలనే భావిస్తున్నారు.  ఇందు కోసం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అక్కడితో ఆగకుండా హౌస్ అరెస్టుల పర్వానికీ తెరతీశారు.

ఇప్పటి వరకూ తెలుగుదేశం, జనసేనలను ఏ విధంగానైతే ప్రజలలోకి రాకుండా అడ్డుకునేందుకు అణచివేతనే మార్గంగా ఎన్నుకున్న జగన్ ఇప్పుడు అదే అణచివేతను కాంగ్రెస్ పైనా ప్రయోగిస్తున్నారు. గత ప దేళ్లలో కాంగ్రెస్ పార్టీ జగన్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు, ఏదో ఒక సమస్య తీసుకుని ఆందోళనకు పిలుపునిచ్చినా ఆ పార్టీకి క్యాడర్, లీడర్ లేని పరిస్థితిలో అవేమీ కనీస మాత్రం ప్రభావాన్ని చూపలేదు. ఇది వాస్తవం. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తరువాత కొద్దికొద్దిగా పార్టీ క్యాడర్ బయటకు వస్తున్నారు అంతే.  అయితే కాంగ్రెస్ ఆందోళనల స్థాయి ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో లేదన్నది కూడా వాస్తవమే. అయినా  పులి, సింహం అంటూ జగన్ పార్టీ కేడర్ గొప్పగా అభివర్ణించే జగన్ మాత్రం పిల్లిలా భయపడుతున్నారు.  కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్టులు చేయిస్తున్నారు. చివరాఖరికి కాంగ్రెస్ పార్టీ అంటే కూడా జగన్ గజగజలాడిపోతున్నారు. 

సొంత చెల్లిని సైతం హౌస్ అరెస్టు చేయించడానికి వెనుకాడటం లేదు.  ఇంతకీ కాంగ్రెస్ చలో సెక్రటేరియెట్ పిలుపు ఎందుకు ఇచ్చిందంటే..

గత ఎన్నికల ముందు జగన్  తాను అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని ఇచ్చిన హామీని ఇంత కాలం పూర్తిగా విస్మరించి, సరిగ్గా ఎన్నికల వేళ అరకొర పోస్టులతో  నిబంధనలను పాటించకుండా డీఎస్సీ ప్రకటించారు. దీంతో కోర్టు స్టే ఇచ్చింది.  ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిబంధనలతో డీఎస్సీ ప్రకటించి పనికిరాని నోటిఫికేషన్ విడుదల చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  దాని మీదే కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది.  సెక్రటేరియట్ ముట్టడికి సిద్ధమయ్యారు. స్వయంగా షర్మిల సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇటీవలే కుమారుడి వివాహం చేసిన షర్మిల ఆ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ కార్యక్రమంలో ముందుండేందుకు రెడీ అయ్యారు.  షర్మిలను పార్టీ ఆఫీసు నుంచి బయటకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.  రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలిన కాంగ్రెస్ పార్టీని నియంత్రించేందుకు కూడా వందల సంఖ్యలో పోలీసులను మోహరించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అధికార వైసీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఇట్టే అవగతమౌతుంది. 

తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రిగా షర్మిల చేపట్టిన ఆందోళనలను అడ్డుకోవడానికి ప్రయత్నించి గతంలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎంతగా అప్రదిష్టపాలైందో తెలిసిందే. షర్మిలపై అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధ కాండ ఆమె పార్టీకి పెద్దగా మైలేజ్ తీసుకురాకపోయినప్పటికీ, అప్పటికి విపక్షంలో ఉన్న కాంగ్రెస్ బలంగా పుంజుకోవడానికి కారణమైన సంగతి తెలసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పై, షర్మిలపై జగన్ సర్కార్ ప్రయోగిస్తున్న నిర్బంధం కూడా విపక్ష కూటమికి మేలు చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu