బరిలో బ్రాహ్మణి?!
posted on Feb 22, 2024 7:58AM
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల బరిలో దిగనున్నారనే ఓ ప్రచారం అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలో దింపేందుకు పార్టీ అగ్ర నాయకత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఓ ప్రచారం జోరుగా నడుస్తోంది. గుంటూరు ఎంపీగా ఆమెను పోటికి దింపితే, ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి మంగళగిరితోపాటు రాజధాని ప్రాంతం సైతం వస్తుందని.. ఈ నేపథ్యంలో ఆమెకు గుంటూరు లోక్‌సభ స్థానం ఫిక్స్ చేస్తున్నారనే ఓ ప్రచారం హల్‌చల్ చేస్తోంది.
అదీకాక.. ఆమె గుంటూరు నుంచి బరిలో దిగి.. గెలిస్తే లోక్‌సభలో రాజధాని సమస్యలపై ప్రస్తావించడమే కాకుండా.. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలో వస్తే.. రాజధాని కోసం ఏ ఏ అంశాలు సభలో ప్రస్తావనకు తీసుకు రావాలి.. అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఏ విధి విధానాలు చేపట్టాల్సి ఉంది.. వాటి అమలు కోసం.. కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడంతోపాటు .. మామగారు చంద్రబాబు మార్గదర్శకంలో.. పని చేసేందుకు ఆమెకు వీలు కలుగుతోందనే ఓ చర్చ సాగుతోంది.
అలాగే గుంటూరు నుంచి నారా బ్రాహ్మణిని బరిలో దింపితే ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పడితే.. ఆ సమయంలో నారా భువనేశ్వరితో పాటు నారా బ్రహ్మణి ప్రజల్లోకి రావడమే కాదు.. బాబు అరెస్ట్ కావడంతో.. మీరు ఒంటరి అయిపోయారని భావిస్తున్నారా? అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు... అదేమీ లేదు.. మాతో ప్రజలు ఉన్నారంటూ.. పక్కా క్లారిటీగా.. పూర్తి ఆత్మ విశ్వాసంతో ఆమె స్పందించిన తీరు కు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పథంలో సాగిందో.. యువత భవిష్యత్ ఎలా కొత్త పుంతలు తొక్కిందో అందరికీ తెలిసిందేనని... అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో యువత.. డ్రగ్స్, గంజాయి మత్తులో తమ భవిష్యత్తును నాశనం చేసుకొంటున్నదని ఆమె సోదాహరణగా వివరించారని, బాబు అరెస్టు అయినప్పుడు నారా బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉంటూ.. పార్టీ సీనియర్ నేతలతో సైతం భేటీ అయి.. పార్టీ భవిష్యత్ కార్యాచరణకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారని.. అలాంటి ఆమె రేపు ఎన్నికల్లో పోటికి దిగి.. గెలిస్తే మాత్రం... తనదైన శైలిలో రాజకీయ చతురతో వ్యవహరించ గల నేర్పు ఆమె సొంతమని రాజకీయవర్గాలు అంటున్నాయి. నారా బ్రాహ్మణి ఎన్నికల బరిలో దిగితే సైకిల్ పార్టీకి ప్లస్ పాయింట్ కావడం మాత్రం పక్కా అంటున్నారు.
మరోవైపు నారా బ్రాహ్మణి.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారంటూ.. మరో ప్రచారం సైతం సాగుతోంది.. అదీకూడా తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మించిన జిల్లాలోని అత్యంత కీలక మైన అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నట్లు ఓ ప్రచారం జరుగుతోంది.
ఇంకోవైపు.. ఇప్పటికే టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణతోపాటు ఆయన చిన్నల్లుడు భరత్ సైతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని... అలాంటి వేళ.. నారా బ్రాహ్మణి సైతం పోటీకి దిగితే మాత్రం.. ఒకే ఫ్యామిలీ నుంచి ఇంత మంది బరిలో దిగుతున్నారంటూ.. ప్రత్యర్థి ఫ్యాన్ పార్టీ చేతికి విమర్శలు చేసే అవకాశం స్వయంగా కల్పించినట్లు అవుతుందనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.
ఏదీ ఏమైనా నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల బరిలో నిలిస్తే మాత్రం.. ఆమె గెలుపను ఎవరు ఆపలేరని.. ఆమె సభలో అడుగు పెట్టడమే తరువాయి అనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.