కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం.. గంటానే కారణం!!
posted on Jan 28, 2019 3:52PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చారు. తరువాత టీడీపీకి దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోరుకి సిద్ధమయ్యారు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ నేతల తరుపున ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడు అదే టీడీపీ నేతల మీద విరుచుకు పడుతున్నారు. ఆ నేతల జాబితాలో గంటా శ్రీనివాసరావు ఒకరు. గత కొద్దిరోజులుగా గంటా మీద విమర్శలు గుప్పిస్తున్న పవన్.. తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. అంతేకాదు అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడానికి గంటానే కారణం అంటూ బాంబు పేల్చారు.
గుంటూరులో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో తన మద్దతుతో గెలిచిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండి అన్నారు. గంటాకు జనసేనలోకి ఎంట్రీ లేదని చెప్పారు. అదేవిధంగా ప్రజారాజ్యం విలీన అంశాన్ని ప్రస్తావించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలన్న డీల్ తీసుకొచ్చింది గంటానేనని అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే ఆఫర్ తెచ్చిన గంటా.. ఇప్పుడు తన పార్టీ మీద ఏదేదో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
అయితే పవన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ స్థాపించింది చిరంజీవి అయినా అంతా వెనుక ఉండి నడిపించింది అల్లు అరవింద్ అని అప్పట్లో గుసగుసలు వినిపించేవి. అంతేకాదు 'జెండా పీకేద్దాం' అని ముందు అల్లు అరవింద్ అన్న తరువాతే చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలీదు. ఇప్పుడు పవనే స్వయంగా కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం చేయడానికి గంటా కారణం అంటున్నారు. గంటా మీద మండిపడుతున్నారు. మరి 2014 ఎన్నికల్లో ఇదే గంటా తరపున పవన్ ఎందుకు ప్రచారం చేసారు. అప్పుడు తెలీదా పవన్ కి విలీనానికి కారణం గంటా అని? అంటూ కొందరు పవన్ మీద విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శలని పవన్ ఎలా తిప్పికొడతారో చూడాలి.