అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలోకి!!
posted on Jan 28, 2019 2:33PM
దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు హితేష్ తో కలిసి జగన్ తో భేటీ అయ్యి వైసీపీలో చేరిక గురించి చర్చించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. దగ్గుబాటి కుటుంబం మీద విమర్శలు గుప్పించారు. తాజాగా చంద్రబాబు టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని విమర్శించారు. దగ్గుబాటి చేరని పార్టీలు లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ, ఇప్పుడు వైసీపీ.. అన్ని పార్టీలు మారారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో పురంధేశ్వరి కేంద్రమంత్రి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారని, ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారన్నారు. అధికారం కోసమే ఫిరాయిస్తున్నారని విమర్శించారు. వీరు అవకాశవాదంతో ఎన్టీఆర్‌ను వాడుకున్నారని, ఎన్టీఆర్‌కు అప్రతిష్ట తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం వైసీపీలో అవకాశవాదులు ఉన్నారన్నారు. అవకాశవాదులు ఒకేచోట చేరిపోయారని విమర్శించారు.