ఇహనో.. ఇప్పుడో కేటీఆర్ అరెస్ట్
posted on Dec 20, 2024 10:24AM
ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు రంగం సిద్ధం అయ్యిందా? ఇహనో, ఇప్పుడో ఆయనన అరెస్టు అయ్యే అవకాశం ఉందా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔనన్న సమాచారమే వస్తోంది. తనపై ఏసీనీ నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలంటూ కేటీఆర్ శుక్రవారం (డిసెంబర్ 20) హెకోర్టును ఆశ్రయించనున్న నేపథ్యంలో ఆలోగానే కేటీఆర్ ను అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయమే తెలంగాణ భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకోవడం, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా తెలంగాణ భవన్ కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలాగే కేటీఆర్ పై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదయింది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే విదేశీ కంపెనీకి రూ. 55 కోట్ల నిధులు చెల్లించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.