పవన్ కళ్యాణ్-చంద్రబాబు నాయుడు భేటీ వివరాలు
posted on Nov 12, 2015 2:04PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అనంతరం ఆయన మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పారు. క్లుప్తంగా ఆ వివరాలు.
"సినిమా షూటింగ్ ఉండటంతో నేను అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రాలేకపోయాను. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిని అభినందించి దీపావళి శుభాకాంక్షలు తెలుపుదామని వచ్చేను. ఈ సందర్భంగా అనేక విషయాలపై మేము చర్చించేము. రాజధాని ప్రాంతంలో నా దృష్టికి వచ్చిన రైతుల సంస్యలనన్నిటినీ ముఖ్యమంత్రికి తెలియజేశాను. రైతులకు, అలాగే విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల విషయంలో గిరిజనులకు నష్టం కలగని విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని నేను కోరాను. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై కూడా మేము చర్చించాము. ప్రస్తుతం ఆ అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. దానిపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసిన తరువాతనే స్పందించాలని నేను భావిస్తున్నాను. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో (జి.హెచ్.ఎం.సి.) పోటీ చేసేంత ఆర్ధిక స్తోమత మాకు లేదు కనుక పోటీ చేయడం లేదు. అదే కాదు 2019వరకు వచ్చే ఏ ఎన్నికలలోనూ జనసేన పార్టీ పోటీ చేయబోదు. అప్పటికి పార్టీ నిర్మాణం పూర్తి చేసుకొని పోటీ చేస్తాము. జి.హెచ్.ఎం.సి., వరంగల్ ఉప ఎన్నికలలో తెదేపా-బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసే విషయంపై నేను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాని గురించి నా సన్నిహితులతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు.
బిహార్ ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందించడానికి నిరాకరించారు. అలాగే మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ, “నిజమే నేను డిల్లీ వెళ్లి ప్రధాని మోడీగారిని కలిసి ప్రత్యేక హోదా గురించి అడగవచ్చును. ఆయన నున్సి సానుకూల స్పందన రాకపోతే అప్పుడు మనమే బాధపడాల్సి వస్తుంది. అయినా రాష్ట్రంలో ఇంతమంది ఎంపీలు మనకున్నారు. వాళ్ళు స్వయంగా ప్రధానిని కలిసి ఒత్తిడి చేస్తే ఏమయినా ఫలితం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో కేంద్రానికి డెడ్-లైన్ పెట్టే అంత అర్హత నాకుందని అనుకోవడం లేదు. రోడ్లేక్కి ప్రత్యేక హోదా కోసం పోరాడటం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. దేనినయినా ఓపికగా సాధించుకోవాలి. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఖచ్చితం చెప్పేస్తే అప్పుడు ఏమి చేయాలో ఆలోచిస్తాను. ఈలోపుగా ప్రజలకు ఎటువంటి కష్టాలు, సమస్యలు వచ్చినా నేను వచ్చి వారి తరపున నిలబడి ప్రభుత్వంతో పోరాడుతాను,” అని తెలిపారు.