లాలూ తిరకాసులు షురూ...



బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్‌తో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా నితీష్ కుమార్ ఆ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కొట్టేశారు. మొన్నటి జనరల్ ఎలక్షన్లలో కాంగ్రెస్, జేడీయు, ఆర్జేడీ ఎవరికి వాళ్ళే పోటీ చేసి మోడీ చేతిలో చావుదెబ్బ తిన్నారు. ఈ మూడు పార్టీలు బద్ధ శత్రువులు అయినప్పటికీ శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టుగా వీళ్ళందరికీ మోడీ కామన్ శత్రువు కావడం వల్ల ఈ మూడు శక్తులూ కలసి మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించి మోడీకి జలక్ ఇచ్చాయి. బీహార్లో ఆటలో అరటిపండు లాంటి కాంగ్రెస్ పార్టీని అలా వుంచితే, నువ్వా నేనా అనుకునేట్టుగా వుండే లాలూ ప్రసాద్ యాదవ్ - నితీష్ కుమార్ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కుదరటమే ఒక వింత. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ మా మహాకూటమి గెలిస్తే నితీషే ముఖ్యమంత్రి అని ప్రకటించడం మరోవింత. ఎన్నికల ఫలితాలు వెలువడి ఈ కూటమి విజయం సాధించాక కూడా నితీషే ముఖ్యమంత్రి అని లాలూ ఫ్యామిలీ మొత్తం ఎలుగెత్తి చాడటం మరో వింత. అసలు లాలూ ఇంత మంచి వాడు ఎందుకు అయిపోయాడబ్బా  అని సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. ఏదయితేనేం నితీష్‌కి లాలూ లాంటి మంచి ఫ్రెండ్ దొరికాడు అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు లాలూ బీహార్లో తన మార్కు రాజకీయాలు, తిరకాసులు పెట్టడం ప్రారంభించేశాడు. ఈనెల 20వ తేదీన బీహార్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఆ ప్రభుత్వంతో తన కుమార్తె మీసా భారతికి ఉప ముఖ్యమంత్రి పదవి, తన ఇద్దరు పుత్ర రత్నాలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని లాలూ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. మీసా భారతికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అంటే తన కొరివితో తాను తల గోక్కోవడమేనని తెలిసిన నితీష్ కుమార్ ఆ విషయంలో నీళ్ళు నములుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఫ్యామిలీ మొత్తానికీ మంత్రి పదవులు ఇవ్వాలనడం కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే లాలూ మాత్రం తన డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పట్టుదలతో వున్నాడట. తప్పదు మరి.. లాలూగారి తిరకాసులను నితీష్ భరించాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu