మయన్మార్‌లో మరోసారి సైనిక తిరుగుబాటు?
posted on Nov 12, 2015 3:08PM

మయన్మార్‌లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం వుందా? ఆ దేశ ప్రముఖ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని మళ్ళీ గృహ నిర్బంధం చేసే అవకాశం వుందా అనే ప్రశ్నలకు ‘‘అలా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అలా జరగకపోతే మయన్మార్’కి మంచి రోజులు వచ్చినట్టే అనే సమాధానం అంతర్జాతీయ రాజకీయ పరిశీలకుల నుంచి వస్తోంది. ప్రస్తుతం మయన్మార్‌లో సైనిక పాలన సాగుతోంది. మయన్మార్‌కి చుట్టూ వున్న దేశాల్లో ప్రజాస్వామ్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పక్కన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా వుంది. అయినప్పటికీ ఇప్పటికీ మయన్మార్‌లో సైనిక పాలన సాగుతోంది. సైనికులు ‘రంగూన్ రౌడీ’ల తరహాలో పనిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహించక తప్పని పరిస్థితి ఆ దేశ సైనిక పాలకుడు థీన్ సేన్‌కి తప్పలేదు.
అనేకమంది మిలటరీ అధికారులతోపాటు ఆ దేశంలో ఎప్పటినుంచో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తూ ఎన్నో ఏళ్ళు గృహ నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఆగ్ సాన్ సూకీకి చెందిన ఎన్ఎల్‌డి పార్టీ మయన్మార్ ఎన్నికల బరిలో దిగింది. ఈ ఎన్నికలలో సూకీ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం స్థాపించడానికి అసవరమైన పూర్తి మెజారిటీని సూకీ పార్టీ సాధించింది. అయితే అధ్యక్షుడు థీన్ సేన్ మాత్రం సైనికుల చేతులలోంచి అధికారాన్ని ప్రజల చేతుల్లోకి ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ‘‘శాంతియుతంగా అధికార బదలాయింపు చేసుకుందాం’’ అని ఆయన ప్రకటించినప్పటికీ అది ఆయన మనస్పూర్తిగా అనలేదన్న విషయం అర్థం అవుతూనే వుంది. ఇప్పటికే సూకీ ఆ దేశ అధ్యక్షురాలు కాకుండా చట్టాలు చేసేశారు. విదేశీయులను పెళ్ళాడిన వాళ్ళు ఈ దేశంలో అత్యున్నత పదవులు అధిష్టించకూడదన్న చట్టాన్ని సైనిక ప్రభుత్వం సూకీని దృష్టిలో పెట్టుకుని ఏనాడో చేసింది. ఇప్పుడు అధికారాన్ని బదలాయించడానికి సంశయిస్తోంది. ఈ నేపథ్యంలో మయన్మార్ ప్రజల్లో అసహనం పెరిగిపోయే అవకాశం వుందని, దీన్ని సాకుగా చూపించి 1990లో మాదిరిగా మరోసారి సైనిక తిరుగుబాటు జరిపించి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే అవకాశాలూ వున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే సూకీకి మరోసారి గృహ నిర్బంధం తప్పకపోవచ్చు... అప్పుడు మయన్మార్‌లో ప్రజాస్వామ్య స్థాపన అనే ఆశలకు నీళ్ళు వదులుకోవడమే.