మరి కొద్ది సేపటిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం (జనవరి 31) నుంచి ప్రారంభం అవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము   ప్రసంగంతో  బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను   ప్రవేశపెడతారు. బుధవారం (ఫిబ్రవరి 1) వార్షిక బడ్జెట్‌ను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సభ ముందుంచనున్నారు.

బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 14 వరకు జరగనుండగా.. రెండో విడత సమావేశాల కోసం ఉభయ సభలు మార్చి 12న భేటీ కానున్నాయి. మొత్తంగా ఏప్రిల్ 6 వరకు సమావేశాలు జరుగుతాయి.   ఈ సెషన్​లో 36 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

చైనా దురాక్రమణ, అదానీ గ్రూపుపై హిండెన్​బర్గ్ నివేదిక, బీబీసీ డాక్యుమెంటరీ, ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి. ఆయా అంశాలపై చర్చించాలని.. అఖిలపక్ష భేటీలో విపక్షాలు డిమాండ్ చేశాయి. నియమనిబంధనలకు లోబడి సభాపతి అనుమతించే ఎలాంటి అంశంపై అయినా చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలున్నాయి.