తెలంగాణ బడ్జెట్ 3న కాదు 6న

గవర్నర్ తో విభేదాల విషయంలో పూర్తిగా వెనక్కు తగ్గిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఆమెను ప్రసన్నం చేసుకుని బడ్జెట్ సమావేశాలు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. కోర్టులో కేసు ఉపసంహరించుకున్న తరువాత ప్రగతి భవన్ వేదికగా తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, అధికారులతో చర్చలు జరిపారు.

అనంతరం గవర్నర్ తమిళి సైను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు కలిశారు. బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గవర్నర్ ను కోరారు. బడ్జె్ట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్‌‌ తమిళి  సై ను ఆహ్వానించారు. ఉభయ సభల ప్రోరోగ్, తిరిగి సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు అంశాలపై గవర్నర్ తో చర్చించారు.

బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ప్రసంగం ప్రతిని మంత్రి ప్రశాంత్ రెడ్డి గవర్నర్ కు అందించారు.    గతంలో  అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావించినా చివరికి ఆ నిర్ణయాన్ని మార్చుకుంది ప్రభుత్వం. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు గవర్నర్ ను బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు.

దీంతో  ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండగా, అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.  ఫిబ్రవరి 6న  రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.  ముందుగా నిర్ణయించిన మేరకు అసెంబ్లీలో ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా, మారిన పరిస్థితుల కారణంగా అది 6వ తేదీకి వాయిదా పడింది.