ఉండవల్లి.. ఊసరవెల్లి

ఉండవల్లి అరుణ్ కుమార్.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర విభజన తరువాత నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. ఉండుండి ఒక్కసారి తన విలక్షణ, సంచలన,  విశ్లేషణలతో వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి ఉండవల్లి గత ఏడాది జూన్ నెలలో  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. అప్పట్లో ఆ భేటీ పెను సంచలనం అయ్యింది. ఉండవల్లిని కేసీఆర్ ఎందుకు పిలిపించుకున్నారు? కేసీఆర్ పిలిచారు సరే ఉండవల్లి ఎందుకు వెళ్లారు? అన్న చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. ఇద్దరు కలిశారంటే అంత చర్చ జరగాల్సిన అవసరం లేదు. కానీ ఉండవల్లి, కేసీఆర్ భేటీపై మాత్రం సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది.  

ఎందుకంటే రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో మొదటి వరుసలో ఉన్న ఉండవల్లి. . రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తరువాత గత జూన్ లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ తో భేటీ కావడం,  అలాగే విభజనను పూర్తిగా వ్యతిరేకించి, సమైక్యాంధ్ర బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందిన ఉండవల్లిని కేసీఆర్ ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ చర్చించడం నిజంగానే అప్పట్లో  సంచలనం సృష్టించింది. అన్నిటికీ మించి  ఆ భేటీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కూడా ఉండటం మరిన్ని అనుమానాలకు కారణభూతమైంది. అనూహ్య నిర్ణయాలు, వ్యూహాలకు పెట్టింది పేరైన పీకే సమక్షంలో భిన్న ధృవాల్లాంటి కేసీఆర్, ఉండవల్లిల భేటీ అప్పట్లో ఒక సంచలనం. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ   ఎన్నికల హీట్ పీక్స్ లో ఉన్న సమయంలో జరిగిన ఈ భేటీపై పలు విశ్లేషణలు వచ్చాయి.  ఎందుకంటే.. అప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు   తెరాస (అప్పటికి), వైసీపీ కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.  ఇప్పటికీ అదే పరిస్థితి ఉందనుకోండి అది వేరే సంగతి.

ఇరు రాష్ట్రాలలోనూ అధికారంలో పార్టీలకు వ్యూహకర్త పీకేనే. ఇప్పుడు ఆయన రాజకీయ నేత అవతారమెత్తి, వ్యూహకర్తగా రిటైర్ అయిపోయినా.. ఆయన శిష్యగణం ఆయన మార్గదర్శకత్వంలో ఆ బాధ్యతలు నెరవేరుస్తోంది. అంటే  ఇరు రాష్ట్రాలలోనూ అధికార పార్టీలు మరో సారి అధికారం చేపట్టడానికి వ్యూహరచన అప్పటికీ, ఇప్పటికీ పీకేనే.  ఆయన సమక్షంలో ఉండవల్లి, కేసీఆర్ ల భేటీ వెనుక వ్యూహం ఏమిటన్నది అప్పుడు కాదు ఇప్పుడు బయట పడింది.

అదీ తన వాచాలతతో ఉండవల్లి స్వయంగా ఏర్పాటు చేసి.. తన రాజకీయ గురువు వైఎస్ తనయుడు, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు కొన్ని సలహాలు (బయటకు మందలింపుగా కనిపిస్తాయి) కాదు కాదు హితబోధ చేయడం ద్వారా బయటపెట్టారు. బీఆర్ఎస్ ఏపీలో అడుగులు వేయడం, అందుకు జగన్ రెడ్డి స్వాగతించడం వీటన్నిటి వెనుకా.. తెరాస, వైసీపీల మైత్రీ వ్యూహం ఉన్నదన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇక్కడే ఉండవల్లి తన మార్క్ రాజకీయం చూపారు. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  తెలుగుదేశం, జనసేన పొత్తపై చేసిన వ్యాఖ్యలు పైకి చెప్పేదొకటి.. ఆ మాటల అంతరార్ధం మరొకటి అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. సమైక్యాంధ్ర కోసం అంటూ రాజకీయ సన్యాసం ప్రకటించిన ఉండవల్లి ఈ ఎనిమిదిన్నరేళ్లలోనూ ప్రత్యక్షంగా ఏ పార్టీలోనూ చేరలేదు కానీ.. తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కష్టం వచ్చిందంటే మాత్రం.. సందర్బం ఉన్నా.. లేకున్నా.. విభజననాటి ఉద్వేగాలను రెచ్చగొట్టి జగన్ కు ఏదో ఒక మేరకు సానుకూల వాతావరణం క్రియేట్ చేయడానికి నానా ప్రయత్నాలూ చేస్తూ వస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఒక్కో సారి జగన్ తప్పులు ఎత్తి చూపుతారు. మందలిస్తారు. ఏం చేసినా జగన్ కోసమే.

తాజాగా ఆయన తెలుగుదేశం, జనసేన పొత్తు ఉండాలి కానీ, ఎలా ఉండాలంటే అంటూ తనదైన భాష్యం చెప్పారు. ఆ భాష్యం అంతరార్ధం మరో మారు జనగ్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నదే. తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుంటే కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని పనవ్ కల్యాణ్ కోసం త్యాగం చేయాలట. అలాగే పవన్ కల్యాణ్ కూడా తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధం కాకూడదట. ఇదీ జనసేన, తెలుగుదేశం పొత్తు కు ఎవరూ అడగకుండానే తగుదునమ్మా అంటూ ఉండవల్లి పెట్టిన కండీషన్. అక్కడితో ఆగలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుంటే పవన్ పొత్తుకు అంగీకరించవద్దని సలహా ఇచ్చారు. అలా అంగీకరించకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదని ఉండవల్లి చెబుతున్నారు. ఎందుకంటే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు.. అలాగని జనసేనా రాదు.. కానీ తెలుగుదేశం అధికారానికి దూరమైతే ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా జనసేనే ఉంటుందన్నది ఉండవల్లి భాష్యం. ఆయన పైకి ఏ డిక్షన్ తో మాట్లాడినా, ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చినా.. ఆయన మాటల సారాంశం మాత్రం జగన్ కు మరో చాన్స్ అన్నదే. తన మాటల గారడీతో జగన్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి తన వంతు సహకారం అందించడానికి ఆయన ఎన్ని ముసుగులు వేసుకునైనా వస్తారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో మద్యం ధరల నుంచి పోలవరం వరకూ ప్రతి విషయంలోనూ నోటికి మైకు కట్టుకుని మరీ విమర్శలు గుప్పించిన ఉండవల్లి జగన్ హయాంలో మద్యం బ్రాండ్లు, రేట్లపై ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు.  

అసలు రాష్ట్రంలో సమస్యలన్నవే లేవన్నట్లుగా ఆయన ఎన్నికల పొత్తుల విషయంలో జగన్ కు ఏది మేలో అన్యాపదేశంగా ఉపదేశిస్తున్నట్లు కనిపిస్తున్నది. జనసేన పార్టీకి రాష్ట్రంలోని 175 స్థానాలలోనూ సొంతంగా అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకునే అవకాశం లేదన్నది ఉండవల్లి అంచనాగా కనిపిస్తున్నది.. అదే సమయంలో ఒంటరి పోరులో విజయం సాధించే సత్తా తెలుగుదేశం పార్టీకి లేదన్నది ఆయన సొంత విశ్లేషణ. ఈ రెంటినీ ముడిపెట్టి వారి పొత్తు పొసగకుండా చేస్తే.. అధికారం జగన్ దే అన్నది ఆయన ఆశ.  ఈ ఒక్క విశ్లేషణతో కేసీఆర్ తో ఉండవల్లి ఎందుకు భేటీ అయ్యారు, బీఆర్ఎస్ ఏపీ శాఖ బాధ్యతలకు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఎందుకు తెలంగాణ సీఎం కట్టబెట్టారు. దానిని ముఖ్య సలహాదారు సజ్జల ఎందుకు స్వాగతించారు.. ఆ వెంటనే పొత్తుల విషయంలో అడగకుండానే ఉండవల్లి సలహాలు ఎందుకు ఉచితంగా ఇచ్చేస్తున్నారన్నదానిపై రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది.

తనకు తానే రాజకీయ మేధావిగా ప్రకటించుకుని.. పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రసంగాలు, మీడియా సమావేశాలలో సలహాలు ఇచ్చుకుంటూ పబ్బం గడుపుకుంటున్నానని చెప్పుకుంటున్న ఉండవల్లి.. ఏపీ రాజకీయాలలో పొత్తు పొడుపులను పుటుక్కు మనిపించాలన్న వ్యూహంతో రంగులు మారుస్తున్నారు.  అయితే.. ఆయన మాటలకు గానీ, సూచనలక కానీ విపక్షాల నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడమే.. రాజకీయ పార్టీలు ఆయనకు ఇస్తున్న విలువకు నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు.