పరిటాల శ్రీరామ్ ఎంట్రీకి చంద్రబాబు బాబు గ్రీన్ సిగ్నల్
posted on Oct 15, 2012 10:58AM


అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలో అతిపెద్ద గుర్తింపును అందుకున్నది. రాష్ట్రంలో ఎక్కడ విభేదాలు భగ్గుమన్నా దాని వెనుక ఎవరు ఉన్నారు అన్న ప్రశ్న లేచిందో ఈ నియోజకవర్గ నేతను గుర్తు చేసుకునేవారు. దివంగత ఎమ్మెల్యే పరిటాల రవి పేరు రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. గొడవలు, అల్లర్లు అన్నింటినీ నియంత్రించగలిగిన నేతగా ఈయన ఎదిగిన తీరు రామ్‌గోపాల్‌వర్మ వంటి ప్రముఖ దర్శకుడు, నిర్మాత చిత్రీకరించాక ఈ నియోజకవర్గం పేరు ఇంకా పాపులర్ అయింది. ఈ పాపులార్టీని రవి వ్యతిరేక గ్రూపు కూడా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే పరిటాల రవి కుటుంబమే ఆ ఫేమ్ నిలబెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏళ్లు గడిచేకొద్ది మార్పులు సహజం కాబట్టి పరిటాల రవి హత్యానంతరం సునీత ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రవి పెద్దకుమారుడు పరిటాల శ్రీరామ్ తాజా ఆకర్షణ అయ్యారు. ఈయనే భవిష్యత్తు ఎమ్మెల్యే అని పరిటాల అభిమానులు భావిస్తున్నారు. పైగా పరిటాల కుటుంబం ఏర్పాటు చేసిన ట్రస్టులో కీలకమైన బాధ్యతలు శ్రీరామ్ ఇటీవలే చేపట్టారు. దీంతో రవి అభిమానులు తమ ఆశ నెరవేరే సమయం వచ్చేసిందని భావిస్తున్నారు. అయితే, తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి వస్తాడని, 2014 ఎన్నికల్లో మాత్రం పోటీలో ఉండడని తల్లి, ఎమ్మెల్యే పరిటాల సునీత వెల్లడిరచారు. సునీత ఈ ప్రకటన చేయటం ద్వారా అభిమానులు ఎంత వరకూ తన కుమారుడు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారో అంచనా వేసుకునేందుకు అవకాశం తీసుకున్నారు. ఇప్పటికే ట్రస్టు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గంటూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న శ్రీరామ్ తాజాగా తల్లితో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా పాదయాత్రకు హాజరయ్యారు. దీంతో అభిమానులు ఉండబట్టలేక చంద్రబాబును శ్రీరామ్‌తో మాట్లాడిరచమని అభిమానులు కోరారు. దీనికి సునీత నవ్వుతూ దానికి ఇప్పుడు కాదు అన్నారు. అంటే సునీత ముందుగా శ్రీరామ్‌కు రాజకీయానుభవం తెలియజేశాక కానీ, రంగంలో దించకూడదని ఆలోచించి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే వెంటనే శ్రీరామ్‌ను దించేస్తానని గతంలో రవి అభిమానులకు సునీత మాట ఇచ్చారు. చంద్రబాబు కూడా పాదయాత్ర సమయంలో తెలివిగా త్వరలో శ్రీరామ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అభిమానులకు భరోసా ఇచ్చారు. అంటే చంద్రబాబు, సునీత ఇద్దరూ కూడా శ్రీరామ్‌కు రాజకీయ అవగాహన పెంచేందుకు నిర్ణయించుకున్నారని అభిమానులు భావిస్తున్నారు. అయితే సునీత వైఖరి ఊరించేదిలా ఉందని అభిమానులు అంటున్నారు. ఇలా ఊరించి ఊరించి ఒక్కసారిగా రంగంలోకి దించితే గెలుపు ఖాయం అవుతుందని సునీత, చంద్రబాబు భావిస్తున్నారేమో? అయి ఉండొచ్చు కదా!