ఎన్టీఆర్ కు పాతికేళ్లుగా వారం వారం నివాళులు!

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు ఓ అసోసియేషన్ గత పాతికేళ్లుగా ప్రతి గురువారం ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈ అరుదైన  ఘనతను సొంతం చేసుకున్న అసోసియేషన్ పేరు పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నందమూరి తారకరామారావు విగ్రహానికి ఈ సంస్థ గత పాతికేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి గురువారం ఉదయం ఎనిమిదిన్న గంటలకు నివాళులర్పించడాన్ని ఒక ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది.  

ఈ క్రమంలో ఈ గురువారం (డిసెంబర్ 25)తో ఈ కార్యక్రమానికి 25 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ రజతోత్సవ వేడుకలను నిర్వహించింది.  ఎన్టీఆర్ అంటే నటన, రాజకీయాలు మాత్రమే కాదని.. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంది. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అయిన శకపురుషుడు నందమూరి తారకరామారావుకు   గత పాతికేళ్లుగా ప్రతి గురువారం  గుంటూరులోని  బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి గురువారం నివాళులు అర్పిస్తూ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అరుదైన ఘనతన సొంతం చేసుకుంది.  పరిస్థితులు ఎలా ఉన్నా గత పాతికేళ్లుగా ఒక్క గురువారం కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమం కొనసాగించామని అసోసియేషన్ ప్రతినిథులు తెలిపారు. 

ఇక  ఈ నివాళుల కార్యక్రమం పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఎన్టీఆర్ విగ్రహానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, సినీ ప్రస్థానం, రాజకీయ సేవలను అభిమానులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను తరతరాలకు తెలియజేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతు న్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రతి గురువారం ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తామని చెప్పారు. 

గుంటూరులో ఎన్టీఆర్ అభిమాన సంఘానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1969లో గుంటూరు రైలుపేట ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు, రాజకీయ జీవితానికి అభిమానులు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆ అభిమాన సంఘానికి కొనసాగింపుగానే పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పడింది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. రజతోత్సవ వేడుకల సందర్భంగా  ఎన్టీఆర్ ఆశయాలను యువతకు చేరువ చేయడమే సంకల్పమని అసోసియేషన్ ప్రతినిథులు తెలిపారు.  భవిష్యత్తులోనూ ప్రతి గురువారం ఇదే విధంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తామన్నారు. అలాగే స్వచ్ఛంద కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో గుంటూరు బస్టాండ్ సెంటర్ ప్రాంతం అభిమానులతో కళకళలాడింది. ఎన్టీఆర్ నినాదాలు, పుష్పవర్షం, జై ఎన్టీఆర్ అంటూ మార్మోగిన నినాదాలతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది. ఈ కార్యక్రమం చూసిన పలువురు ప్రయాణికులు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu