వల్లభనేని వంశీని వీడని కేసుల గ్రహణం...మళ్లీ అజ్ఞాతంలోకి

 

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీని కేసుల గ్రహణం వీడటం లేదు. తాజాగా ఆయనపై మరో హత్యాయత్నం కేసు నమోదవ్వడంతో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లారు.   2024 జూన్ 7వ తేదీన సునీల్ అనే వ్యక్తిపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 17వ తేదీన మాచవరం పోలీసులు వల్లభనేని వంశీపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. సునీల్‌పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి మొదటి నుంచే వంశీ పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో కీలక ఆధారాలు లభించడంతో, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు విజయవాడ మాచవరం పోలీసులు వెల్లడించారు. 

ఈ కేసు నమోదు తర్వాత నుంచి వల్లభనేని వంశీ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. వంశీపై కేసు నమోదు కావడం, వెంటనే ఆయన కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది. గతంలోనూ వివాదాస్పద అంశాల్లో ఆయన పేరు వినిపించిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది

ఇదిలా ఉంటే.. గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై వంశీ, వైసీపీ కీలక నేతలు దాడి చేశారు. ఈ కేసులో సత్యవర్థన్ ప్రధాన సాక్షిగా ఉన్నారు. ఈ కేసు బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సత్యవర్థన్‌ను వంశీ కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులోనే ఆయన జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదల అయ్యారు. ప్రస్తుతం సునీల్‌పై హత్యాయత్నం కేసులో మాచవరం పోలీసులు వంశీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆయనకు సంబంధించిన సన్నిహితులు, అనుచరులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

వంశీ దేశంలోనే ఉన్నారా లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ఎంతటి రాజకీయ నేపథ్యం కలిగి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని పోలీసులు స్పష్టం చేశారు. వంశీని త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ చేపడతామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం గన్నవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా భద్రతపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మాచవరం పోలీసులు వెల్లడించారు.
 


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu