ఉస్మానియాలో ఆత్మహత్యలు జరక్కూడదు




ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు ఒక్కటే మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. అది... ఉస్మానియా యూనివర్సిటీలో ఇకపై ఆత్మహత్యలు జరగకూడదు. సున్నిత హృదయులైన విద్యార్థులు మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడకూడదు. వాళ్ళందరూ చల్లగా వుండాలి. హాయిగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. కానీ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మనోభావాలను గాయపరిచేలా వున్నాయి. ఇలా మనోభావాలు గాయపడటం వల్లే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేశారు. మా తెలంగాణ మాగ్గావాలె... మా భూములు మాగ్గావాలె.. మా నీళ్ళు మాగ్గావాలె... మా నిధులు, నీళ్ళు మాగ్గావాలె అంటూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉస్మానియా విద్యార్థులు అనేకమంది తెలంగాణ రాదేమోనన్న బెంగతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఆత్మబలిదానాలతో తెలంగాణ అమరవీరులుగా చరిత్రలో నిలిచిపోయారు. వారికి జోహార్లు.

ఉస్మానియా విద్యార్థులు సరస్వతీ పుత్రులు. వాళ్ళు నిరంతరం చదువుకుంటూనే వుంటారు. అద్భుతమైన చరిత్ర వున్న విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నామన్న ఆత్మ సంతృప్తితో వుంటారు. ఉస్మానియాలో ఎక్కడ చూసినా మెరికల్లాంటి విద్యార్థులు కనిపిస్తూ వుంటారు. ఒక ఐన్‌స్టీన్, ఒక థామస్ అల్వా ఎడిసన్‌లకు తీసిపోని మేధావులు ఉస్మానియా యూనివర్సిటీలో వున్నారు. వారు కేవలం మేధావులు మాత్రమే కాదు... వారిలో అంతర్లీనంగా కవులు, కళాకారులు, పోరు బిడ్డలు, ఉద్యమవీరులు కూడా వున్నారు. ఇలాంటి గొప్పగొప్ప విద్యార్థులతో ఉస్మానియా విశ్వవిద్యాలయం కళకళలాడుతూ వుంటుంది. ఇలాంటి విద్యార్థులు తన దగ్గర చదువుకుంటూ ఉన్నందుకు విశ్వవిద్యాలయం గర్వంతో పొంగిపోతూ వుంటుంది. అలాంటి విద్యార్థులు తమ మనోభావాలు దెబ్బతింటే మాత్రం రాజీలేని ఉద్యమం చేపడతారు. తమ ప్రాణాలు పోయినా లెక్క చేయరు. తాము నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరు.

ఉస్మానియా విద్యార్థుల ఆ తత్వమే ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. తెలంగాణ రాష్ట్రం రాగానే తమకు ఉద్యోగాలు వచ్చేస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన ఉస్మానియా విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఆ నిరాశతోనే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లాంటి ప్రభుత్వ నిర్ణయాలు ఉస్మానియా విద్యార్థుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. దానికితోడు తాజాగా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో పేదలకు ఇళ్ళు కట్టించాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా వారిని ఎంతో బాధపెడుతోంది. తమ యూనివర్సిటీ స్థలాలను లాక్కుంటే ఒప్పుకోమంటూ ఉద్యమించిన విద్యార్థుల వీపుల మీద లాఠీలు నాట్యం చేశాయి. ఉస్మానియా స్థలంలో కట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందిన హోటల్ మీద ఏదో ఆవేదనతో రాళ్ళతో దాడి చేసిన విద్యార్థులను రిమాండ్‌కి పంపించడం కూడా ఉస్మానియా విద్యార్థి లోకానికి మనోభావాలు దెబ్బతినేలా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా క్రుంగిపోయిన ఉస్మానియా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడతారేమోనన్న ఆందోళన అందరిలోనూ కలుగుతోంది. అలా జరిగితే తెలంగాణ తల్లి కన్నీరు మున్నీరు అయిపోతుంది. అందుకే అలా జరక్కుండా చూడాలి. అలా జరక్కుండా చూసే శక్తి తెలంగాణ ముఖ్యమంత్రి, బంగారు తెలంగాణ సాధనకు నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ చేతిలోనే వుంది.