ఆపరేషన్ ‘అవినీతి ద్వారం’పూడి ఆరంభం!?

వైసీపీ ఎమ్మెల్యేలలో అత్యంత అవినీతి పరుడు ఎవరంటే ఆ పార్టీ వర్గాలే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరు చెబుతారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తన అవినీతికి హద్దులే లేవన్నంతగా చెలరేగిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అప్పట్లో ఆయనపై ఫిర్యాదులు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక వేళ ధైర్యం చేసి ముందుకు వచ్చినా వాటిని స్వీకరించే నాథుడే లేని పరిస్థితి ఉండేది. 

ఇప్పుడు పరిస్థితి మారింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. పౌరసరఫరాల శాఖ మంత్రిగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టారు. గతంలో అంటే జగన్ హయాంలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అవినీతిలోనే కాకుండా, జనసేనాని పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంలోనూ, వ్యక్తిత్వ హననం లక్ష్యంగా దుర్భాషలాడటంలోనూ అన్ని హద్దులూ దాటేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ నుంచి పోటీలో దిగినా పవన్ కల్యాణ్ ను ఓడించి తీరుతానని శపథాలు చేశారు. ఈ నేపథ్యంలోనే  పవన్ కల్యాణ్ కూడా తన వారాహియాత్రలో భాగంగా కాకినాడలో పర్యటించిన సందర్భంగా అవినీతి ‘ద్వారం’పూడి చంద్రశేఖర్ రెడ్డి అని అభివర్ణించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలూ కూడా ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం కోసమే పని చేస్తున్నారని విమర్శించారు.

రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా ద్వారంపూడి తరలించి కోట్లు మూటగట్టుకున్నారనీ, తాము అధికారంలోకి రాగానే ఆ అవినీతి సంపాదనను వెలికి తీసి కక్కిస్తామని సవాల్ చేశారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా కాకినాడ కలక్టర్ కార్యాలయంలో అధికారులతో  పౌరసరఫరాల శాఖలో  పాలనా పరమైన లోటుపాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా చిత్తూరు జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు వేల లారీల్లో తరలించారని విమర్శించారు.  ద్వారంపూడి కుటుండం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేయడం ద్వారా కొత్త ఫాఫియాను నడిపారని విమర్శించారు.  

ఇక నుంచి అన్ని రకాల అవినీతి కార్యకలాపాలను అరికట్టాలని చెప్పిన నాదెండ్ల మనోహర్ అధికారులు అవినీతికి వంత పాడే గుణాన్ని వదులుకోవాలని హెచ్చరించారు.  ద్వారంపూడి అవినీతిని ఎక్స్ పోజ్ చేసే క్రమంలో  మంత్రి మనోహర్ హెచ్చరికలు తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. రానున్న రోజులలో అవినీతి ద్వారంగా మారిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అవినీతిని మరింతగా వెలుగులోకి తెచ్చి ఆయనను చట్టం ప్రకారం శిక్షించే ఆపరేషన్ వేగం పుంజుకుంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.