తెలుగు ప్రజల ఆస్తి ఎన్టీఆర్

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు తెలంగాణలో కూడా ఘనంగా జరిగాయి. ఒక్క తెలంగాణ అనేమిటి తెలుగువారు ఉన్న అన్ని దేశాలలో, రాష్ట్రాలలో  ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ  తన 101వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎన్టీఆర్ ను స్మరించుకుని ఆయన గొప్పతనాన్ని ప్రస్తుతించారు.  

తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో  రాజకీయ రంగ ప్రవేశం చేసిన విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు,  నందమూరి తారక రామారావు  రాజకీయాలను ప్రజలకు చేరువ చేశారు. సంక్షేమం, సంస్కరణలలో విప్లవం తీసుకువచ్చారు.  అందుకే రాజకీయాలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఎన్టీఆర్ ను అందరూ అభిమానిస్తారు. గౌరవిస్తారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ, విదేశాలలో ఉన్న తెలుగువారందరూ ఘనంగా జరుపుకున్నారు. 

 తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేయడమే లక్ష్యంగా  పని చేసిన కేసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ.. శత జయంతిని ఘనంగా నిర్వహించడం ఎన్టీఆర్ గొప్పదనానికి, ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు.  ఎన్టీఆర్ శత జయంతిని పలువురు బిఆర్ఎస్ నాయకులు నిర్వహించడం  రాజకీయాలకు అతీతంగా ఆయనపై ఉన్న అభిమానం, గౌరవాలకు తార్కానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.  రాష్ట్ర విభజనకు ముందు, తరువాత కూడా అంటే ఎన్టీఆర్ మరణం తరువాత తెలుగుదేశం పార్టీని ఆంధ్రాపార్టీగా ముద్ర వేసినా.. ఎన్టీఆర్ ను మాత్రం బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ తమ వాడిగా, ఆత్మీయుడిగా గుండెల్లో దాచుకుందనడంలో సందేహం లేదు.

రాష్ట్ర విభజనకు ముందు జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీని ఉద్యమ నేతలు విమర్శలు చేసినా తెలంగాణ అభివృద్ధిలో ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం భాగస్వామ్యాన్ని వారు విస్మరించలేదు.   తెలుగుజాతి ఉమ్మడి ఆస్తి ఎన్టీఆర్. రాజకీయ, ప్రాంతీయ విభేదాలతో ఎవరైనా సరే ఆయన ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని విస్మరించలేరు. తెలుగు నుడికారం ఎన్టీఆర్, తెలుగు జాతి చిరునామా ఎన్టీఆర్. జయమో ఎన్టీఆర్