అర్థరాత్రి భేటీల ఆంతర్యమేమిటి?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనల వెనుక ఏమైనా మిస్టరీ ఉందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. మరీ ముఖ్యంగా వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ప్రారంభించినప్పటి నుంచీ అంటే జనవరి నుంచి ఆయన హస్తిన పర్యటనలపై అనుమానాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి.

అవినాష్ అరెస్టు అనివార్యం అని పించిన ప్రతి సారీ ఆయన హస్తినకు వెళ్లారు. అలా వెళ్లిన ప్రతి సారీ  దర్యాప్తు సీన్ మారిపోయింది. వేగం మందగించింది. పరిశీలకులు సైతం సీబీఐ దర్యాప్తునకు జగన్ హస్తిన పర్యటనలకూ ఏదో లింక్  ఉందనే విశ్లేషణలే చేస్తున్నారు. అన్నిటికీ  మించి గత రెండు పర్యటనలలోనూ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ రెండు భేటీలూ కూడా నిశిరాత్రి వేళఏ జరిగాయి.  అ భేటీలో పోలవరం నిధులు, విభజన హామీల అమలు గురించి చర్చ జరిగిందంటూ జగన్ సర్కార్ ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటుంది.

కానీ పోలవరం నిధులకు, విభజన హామీల అమలుకూ, కేంద్ర హోంమంత్రికి ఏమిటి సంబంధం అన్న ప్రశ్నకు మాత్రం అటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ సమాధానంొ ఉండదు.  సాధారణంగా కేంద్ర మంత్రులు,  కేంద్ర మంత్రులేమిటి మంత్రులెవరైనా సరే అధికారిక కార్యక్రమాలను  అధికారిక భేటీలను ఉదయం సమయంలోనే నిర్వహిస్తారు. పార్టీ వ్యవహారాలకు మాత్రమే కార్యాలయ సమయం పూర్తయిపోయిన తరువాత  సమయం ఇస్తారు.   దీంతోనే ఏపీ సీఎం జగన్ అమిత్ షా తో అర్ధరాత్రి భేటీలు రాష్ట్ర ప్రయోజనాల కోసమా లేక సీఎం స్వంత వ్యవహారాల కోసమా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.

ఈ భేటీలపై ఏపీ ప్రజలలో కూడా సందేహాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో సీబీఐ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో జగన్ పేరు ఉండటంతో ఆయన అమిత్ షాతో జరిపిన తాజా అర్ధరాత్రి భేటీపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.