కవిత కనిపించడం లేదు.. వినిపించడం లేదు.. కారణమేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్కడ అనే ఓ చర్చ తెలంగాణ  రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడంతోపాటు.. ఈ ఏడాది మార్చిలో ఒకటి సారి రెండు సార్లు కాదు.. ముచ్చటగా మూడు సార్లు ఢిల్లీలో  ఈడీ కవితను విచారించింది. ఆమె సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.  ఒకానొక దశలో ఆమెను ఈడీ అరెస్ట్ చేయడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పలురురిని అరెస్టు చేయడం, వారికి బెయిలు కూడా రాకపోవడంతో కవిత అరెస్టు అనివార్యం అన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అంతే  ఆ తరువాత ఈడీ కవితను మళ్లీ  విచారించింది లేదు. అంతే కాదు విచారణకు ముందు, తరువాత గంభీరంగా ప్రకటనలు ఇచ్చి  , కేంద్రంపై విమర్శలు గుప్పించిన కవిత ఆ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో  కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబుతోపాటు పలువురు పెద్ద తలకాయలను   ఈడీ అరెస్ట్ చేసి.. ఢిల్లీలోని తీహార్ జైల్‌కి తరలించిన విషయం విదితమే. వారిలో కొందరికి బెయిల్ వచ్చిందనుకోండి అది వేరే విషయం.   బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు అందరు అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడో ఒక్కప్పుడు బయట కనిపిస్తున్నారు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. కవిత సోదరుడు, సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ అయితే.. ఉన్నతాధికారులతో కలిసి ఇప్పటికే లండన్‌లో పర్యటించి, అక్కడ నుంచి అమెరికా చేరుకొని.. ఆ దేశ పర్యటనలో భాగంగా.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం... పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.  అందుకు సంబంధించి కేటీఆర్ వీడియోలు.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ సైతం చేస్తున్నాయని... అయితే   కవిత  మాత్రం అనూహ్యంగా ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు.  

మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమంలో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర అత్యంత కీలకమని.. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత అయితే.. బతుకమ్మ పండగ సమయంలో ఆడి పాడి.. తెలంగాణ ప్రజలను నిత్య చైతన్యవంతులుగా రూపొందించడంలో కీలకంగా వ్యవహరించిందని.. ఇంకా చెప్పాలంటే.. బతుకమ్మ పండగ కాస్తా.. కవితమ్మ పండగ అయిపోయిందనే ఓ చర్చ సైతం నాడు తెలంగాణ సమాజంలో  జరిగిందని పరిశీలకులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి కవిత  హఠాత్తుగా సైలెంట్‌గా ఉండడం వెనుక మర్మం ఏమిటి? వ్యూహం ఏమిటి? అన్న చర్చ జోరుగా సాగుతోంది. 
     
2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి పాలైన  తర్వాత కొద్ది రోజులు ఆమె  ఇలాగే వ్యవహరించారు.  ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్సీ అయి.. పెద్దల సభలో ఆమె అడుగు పెట్టారని.. అనంతరం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడం.. అనంతరం చోటు చేసుకొన్న పరిణామాలు అందరికీ తెలిసినవేనని స్పష్టం చేస్తోంది. 

ఇంకోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌ 11న ఆమె కాలికి గాయం కావడంతో.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోన్నారని...ఆ తర్వాత మదర్స్ డే సందర్భంగా తల్లిని కలిశారని.. అయితే ఆ తర్వాత అంటే మే 17న పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సైతం ఆమె హాజరుకాలేదని.. బీఆర్ఎస్ పార్టీలోని పలువురు కీలక నేతలు సైతం పేర్కొంటున్నారు. మరోవైపు ఈ నెల 21న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ శిక్షణా శిబిరానికి కేసీఆర్‌తో పాటు కవిత కూడా వెళ్తారని ప్రచారం జరిగినా.. ఆమె వెళ్లలేదు. అలాగే జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న దశాబ్ది ఉత్సవాల్లో అయినా ఆమె కనిపిస్తారా? అని తెలంగాణ ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

అదీకాక.. మద్యం స్కామ్‌లో తమ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నుంచి నోటీసులు రావడంతో.. పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు.. అందుకోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన అంటూ ప్రకటనలు గుప్పించి.. ఆ తర్వాత ఇలా చడీ చప్పడు చేయకుండా.. సైలెంట్ కావడం ఏమిటనే చర్చ సైతం తెలంగాణ సమాజంలో మొదలైంది. అయినా..  మద్యం కుంభకోణంలో తొలుత కవిత పేరు వినిపించడం.. ఆ తర్వాత ఆమె పేరు ఎక్కడ బయటకు రాకపోవడం.. దీంతో కేంద్రంలోని బీజేపీతో బీఆర్ఎస్ బాస్ దోస్తి కట్టిఉంటారనే ఓ చర్చ సైతం.. తెలంగాణ సమాజంలో జోరుగా సాగుతోంది. అయినా.. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. ఇలా కవిత ఏదో అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు సైలెంట్‌గా ఉండడం ఏం బాగోలేదని చర్చ సైతం తెలంగాణ సమాజంలో జోరుగా సాగుతోంది.