రంగంలోకి ఇండియ‌న్ జేమ్స్‌బాండ్‌.. కాబూల్‌లో భార‌తీయులు సేఫ్‌..

తాలిబ‌న్లు అఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించేసుకున్నారు. రాజ‌ధాని కాబూల్‌ను భారీ బ‌ల‌గాలు, ఆయుధాల‌తో చేజిక్కించుకున్నారు. ప్రెసిడెంట్ ప్యాలెస్‌లోకి చొర‌బ‌డి.. తాలిబ‌న్ల రాజ్యం ప్ర‌క‌టించేసుకున్నారు. మ‌రి, కాబూల్‌లో ఉండే భార‌తీయుల ప‌రిస్థితి ఏంటి? రాయ‌బార కార్యాల‌యంతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో ప‌ని చేస్తున్న ఇండియ‌న్స్ సేఫ్‌గా తిరిగొచ్చేది ఎలా? అస‌లే, తాలిబ‌న్ల‌కు హిందువులంటే ధ్వేషం. ఆ ముష్క‌ర మూక‌లు ఎలాంటి దుందుడుకు చర్య‌ల‌కు దిగుతారేమోన‌నే భ‌యం అక్క‌డి భారతీయుల‌ను వెంటాడింది. విష‌యం తెలిసి.. ఇండియ‌న్ ట్ర‌బుల్ షూట‌ర్.. భార‌త భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ వెంట‌నే రంగంలోకి దిగారు. త‌న‌దైన స్టైల్‌లో మంత్రాంగం నెరిపారు. క‌ట్ చేస్తే.. 24 గంటల్లో దాదాపు 200 మంది ఇండియ‌న్స్ అఫ్ఘ‌న్ నుంచి సుర‌క్షితంగా ఇండియాకు తిరిగొచ్చారు. 

తాలిబ‌న్ల దాడితో ఆఫ్ఘ‌నిస్తాన్ ఆర్మీ చెల్లాచెదురైంది. పోలీసులు ప‌త్తా లేకుండా పోయారు. అక్క‌డ భ‌ద్ర‌తా బ‌ల‌గాల జాడే లేదు. మ‌రి, కాబూల్‌లోని భార‌తీయుల‌కు ర‌క్ష‌ణ ఎలా? ఉన్న‌ది ఒక‌టే మార్గం. కాబూల్ విమానాశ్ర‌యంలోని కొంత భాగం అమెరిక‌న్ ఆర్మీ గుప్పిట్లో ఉంది. ఆ ఒక్క పాయింట్‌ను బేస్ చేసుకొని.. అజిత్ దోవ‌ల్ ఇండియాలో ఉండి.. అమెరికాతో మాట్లాడి.. అఫ్ఘ‌న్‌లో చ‌క్రం తిప్పారు. 

ఆఫ్ఘనిస్థాన్‌లోని భారతీయులను సురక్షితంగా స్వ‌దేశానికి తీసుకురావడానికి.. భారత దేశ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, అమెరికా ఎన్ఎస్ఏ జేక్ సులివన్‌తో చర్చలు జరిపారు. వీరిద్దరి చర్చల అనంతరం భారతీయులను కాబూల్ విమానాశ్రయంలోని అమెరికన్ సెక్యూరిటీ జోన్‌లోకి తీసుకున్నారు,  క్షేత్ర స్థాయిలోని అమెరికన్ అధికారులతో సమన్వయం కుదుర్చుకుని, కాబూల్ విమానాశ్రయంలో భారత సీ-17 విమానాలు దిగడానికి అనుమతి పొందారు. సోమ, మంగళవారాల్లో రెండు సీ-17 విమానాలు కాబూల్ నుంచి ఇండియా వ‌చ్చాయి. 46 మందితో ఓ విమానం సోమవారమే భారత్‌కు చేరుకుంది. 120 మందితో మరొక విమానం మంగళవారం రావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సింపుల్‌గా ఉన్నా.. ఈ ఎపిసోడ్ అంతా ఉత్కంఠ‌భ‌రితంగా సాగిందంటున్నారు. స్థానిక సంక్లిష్ట ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డి.. అమెరికన్‌ సెక్యూరిటీ జోన్లోకి వెళ్ల‌డం.. సుర‌క్షితంగా విమానం ఎక్కడం వ‌ర‌కూ.. ప్ర‌తీ ద‌శ‌లోనూ అజిత్ దోవ‌ల్ ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డి వారిని గైడ్ చేస్తూ వ‌చ్చార‌ని తెలుస్తోంది. ఈ క్రెడిట్ అంతా దోవ‌ల్‌కే చెందుతుంద‌ని చెబుతున్నారు. అందుకే.. అజిత్ దోవ‌ల్ భార‌త‌ ట్ర‌బుల్ షూట‌ర్‌.. ఇండియ‌న్ జేమ్స్‌బాండ్‌.