మంగళగిరిలో వైసీపీ గాయెబ్!
posted on Jan 1, 2025 11:36AM
మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా వైసీపీ నాయకుడు కనిపించడం లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఏమంత పట్టు లేని నియోజకవర్గం ఇది. 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి తరువాత నుంచీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేష్ పని చేశారు. ఆయన శ్రమ, కృషి ఫలించింది. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటగా మారిపోయింది. 2024 ఎన్నికలలో లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంత వరకూ నియోజకవర్గంలో తోపులం మేమే అంటూ బోర విరుచుకు తిరిగిన వైసీపీ నేతలంతా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.
ఈ నియోజకవర్గ పరిధిలోనే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ ఉంది. నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంగానే జగన్ నివాసం ఉంది. పార్టీ కార్యాలయం కూడా అదే. అలాంటి మంగళగిరిలో ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ తరఫున పని చేయడానికి నాయకుడూ, కార్యకర్తా కూడా కనిపించని పరిస్థితి ఉంది. అలాంటి చోట. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో వైసీపీ ఫేస్ గా ఫోజులు కొడుతూ తిరిగిన వారంతా ఎంత తొందరగా వైసీపీకి గుడ్ బై కొడితే అంత మేలు అన్నట్లుగా మారిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా, లోకేష్ కు ప్రత్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య.. ఓటమి తరువాత కనిపించడం లేదు. ఆమె అజాపజా లేదు. ఆమె మావ మురుగుడు హనుమంతరావు ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగుతున్నా... ఏ మాత్రం క్రియాశీలంగా లేరు. ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. అటు నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా దూకేద్దామన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి 2024కు ముందు వరుస విజయాలు సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అలియాస్ కరకట్ట కమల్ హసన్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన తీరు గమనిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక వీరు కాకుండా వైసీపీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన గంజి చిరంజీవి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించి భంగపడినా గంజి చిరంజీవి వైసీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ పార్టీ ఘోర పరాజయం తరువాత ఆయన వైఖరి మారింది. పార్టీకి దూరం జరగడమే కాదు.. జనసేనకు దగ్గరయ్యారు. అతి కష్టం మీద పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొంది జనసేన గూటికి చేరిపోయారు. దీంతో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎంప్టీ అయిపోయింది. పార్టీ కార్యక్రమాలను నడిపించే వారు కాదుకదా అసలా పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ లేకుండా పోయిన పరిస్థితి ఉంది. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కు నియోజకవర్గంలో రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. ప్రజాదర్బార్ లో ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నారు. కష్టంలో ఉన్న ప్రతి వారికీ నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. దీంతో జనం స్వచ్ఛందంగా ఆయన నాయకత్వానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారంతా ఇప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 75 వేల మంది కొత్తగా తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు గడువు ముగిసే సరికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే.. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.