తాలిబాన్లతో మనకు ఎంతవరకు ముప్పు?

ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల రాకతో ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. అయితే ప్రపంచ దేశాల ఆందోళన ఒక ఎత్తయితే.. భారతీయుల ఆందోళనంతా మరో ఎత్తు. ఎందుకంటే తాలిబాన్ల ప్రభావం ఇతర దేశాల కన్నా మన మీదే ఎక్కువ ఉంటుంది. దాదాపు 20 రోజుల క్రితం ఖతార్ లో జరిగిన సమావేశాల్లో అమెరికా, చైనా, రష్యా, పాక్ దేశాల స్పందనలు ఇండైరెక్టుగా తాలిబాన్లతో అనధికార సంధిలాగానే జరగడం గమనించాలంటున్నారు విశ్లేషకులు. తమ సైన్యం కాబూల్ ను ఖాళీ చేస్తుందని, ఎవరి మీదా తుపాకులు ప్రయోగించరాదని అమెరికా చెబితే.. తాలిబాన్ల అధికారానికి తమవంతు సహకారం అందిస్తామని చైనా, రష్యాలు ప్రకటించాయి. ఇక ఆ పరిణామం పాకిస్తాన్ కైతే ఎగిరి గంతేసే వార్తలా మారింది. అయితే భారత్ మాత్రం ఎక్కడా తాలిబాన్లకు సపోర్టుగానీ, వ్యతిరేకంగా గానీ మాట్లాడలేదు. దీన్నిబట్టి తాలిబాన్ల రాకడ భారత్ మీదే ఉంటుందనేది కాదనలేని వాస్తవమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

తాలిబాన్లు పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లోంచి కాబూల్ కు రావడం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతాల్లో తాలిబాన్లు సేఫ్ గా, ట్రెయినింగ్ పొందుతూ ఉండడం గమనించాలంటున్నారు. ఇప్పటివరకూ తాలిబాన్లకు మద్దతంతా పాకిస్తాన్ నుంచే జరిగింది. పాక్ లోని ఐఎస్ఐ ఏజెంట్లు, మాజీ ఆర్మీ అధికారులు, మత బోధకులు, మదరసాల్లో చదివిన కుర్రకారు, గంజాయి అక్రమ రవాణా చేసుకొనే చిల్లర గ్యాంగులు.. ఇలా వీరి నుంచే రిక్రూట్మెంట్లు జరిగాయి. శిక్షణ అందిస్తున్నది కూడా పాక్ మాజీ సైన్యాధికారులేనని గమనించాలి. ఇంతక్రితం వరకు ఆఫ్ఘనిస్తాన్ మనకు ఓ మిత్ర దేశంగానే ఉండేది. కానీ తాలిబాన్ల కైవసం అయిపోయాక మన స్టాండ్ ఏంటో మరోసారి నిర్ధారించుకోవాల్సి వచ్చింది. ఆఫ్ఘన్ నుంచి అమెరికా తప్పుకోవడం అనేది అమెరికా ఓటమిగా కాక పాక్ గెలుపుగానే అంతర్జాతీయ సమాజం గుర్తిస్తోంది. అక్కడ త్వరలో ఏర్పాటు కాబోయే మంత్రివర్గంలో ఎవర్ని ఏ శాఖలో పెట్టాలో పాక్ లోనే చర్చ జరుగుతున్నట్టు అంతర్జాతీయ వేదికల ద్వారా తెలుస్తోంది. అంటే పాక్ తనకు ఏం కావాలో ఆఫ్ఘనిస్థాన్లో పరిణామాల ద్వారా నిర్దేశించబోతోందన్నమాట. అంటే ఇప్పటిదాకా మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తాన్ రేపట్నుంచి పాక్ మిత్రదేశంగా అంటే మనకు పక్కా శత్రుదేశంగా మారబోతోందన్నమాట. ఇకపై పాక్ ద్వారా జరిగిన చొరబాట్లు రేపట్నుంచి ఆఫ్ఘనిస్థాన్ నుంచి కూడా జరుగుతాయని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సింది భారతే  తప్ప మరో దేశం కాదని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. 

ఇప్పటికే ఏ దేశంలో కన్నా భారత్ లోనే విపరీతమైన మత స్వేచ్ఛ ఉంది. ఇస్లామిక్ శక్తుల స్వైర విహారం కూడా ఇక్కడే అధికంగా ఉంది. ఫ్రాన్స్ వంటి పలు పాశ్చాత్య దేశాలు బుర్ఖా బ్యాన్ చేశాయి. మసీదుల్లోంచి ఆంప్లిఫయర్ల్ ద్వారా అజాన్ మీద కూడా నిషేధం నడుస్తోంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఓ చర్చగా మారుతోంది. మరోవైపు తాలిబాన్లు మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా పాగా వేశారన్న విషయం గమనించాలి. 20 ఏళ్లుగా చాపకింద నీరులా తీవ్రవాదులతో కనెక్ట్ అయి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఈ మధ్యే హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. దర్భంగాలో సంభవించిన పేలుడుతో ఈ విషయం తేటతెల్లమైంది. ఆ ఇద్దరు వ్యక్తులు తాలిబాన్లతోనే కనెక్ట్ అయి ఉన్నారు. కరీంనగర్, కర్నాటక, భైంసా, దర్భంగా, సీఏఏ వ్యతిరేక ర్యాలీలు.. ఇవన్నీ తాలిబాన్ శక్తులకు ప్రోత్సాహకాలే తప్ప మరోటి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా తాలిబాన్లతో చర్చలు జరపాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ డిమాండ్ చేస్తుండడం కూడా గమనార్హమే. ప్రపంచ ప్రజలంతా తాలిబాన్ పాలనను ఈసడించుకుంటుండగా.. అసదుద్దీన్, శశిథరూర్ సహా... మేధావుల ముసుగులో ఉన్న కొందరు అతి ప్రజాస్వామికవాదులు కూడా తాలిబాన్ ఛాయలను స్వాగతిస్తుండడం భారత్ కు ప్రమాదకరమేనంటున్నారు. 

రెండేళ్ల క్రితం జరిగిన 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకాశ్మీర్ లో ఇప్పుడిప్పుడే ప్రభుత్వ సంస్కరణలు అమలు చేస్తున్నారు. టూరిజాన్ని ప్రోత్సహించే చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక నిర్మాతలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నిర్మాతలను కూడా ప్రోత్సహించే చర్యలు చేపట్టారు. పంద్రాగస్టు వేడుకలు కూడా కాశ్మీర్ వ్యాలీ అంతటా ఘనంగా జరిగాయి. అయితే మన దేశంలో పెరుగుతున్న సుహృద్భావ వాతావరణాన్ని ఆఫ్ఘనిస్తాన్లో తాజా పరిణామాలు కచ్చితంగా ప్రభావితం చేస్తాయనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ ఏ దిశగా అడుగులు వేస్తుందో వేచిచూడాల్సిందే.